తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత పీడీ చట్టం ప్రయోగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గొలుసు దొంగలు, అంతర్రాష్ట్ర దొంగలు, హంతకులు, ఆన్‌లైన్ మోసగాళ్లు, వ్యభిచార గృహాల నిర్వాహకులు, మాదకద్రవ్యాల ముఠాలు, నకిలీ విత్తన ముఠాలు.. ఇలా వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే వారిపై దీన్ని గురిపెట్టారు. స్టాక్‌మార్కెట్‌లో అధిక లాభాలిపిస్తానంటూ మోసం చేశారంటూ ఓ వ్యక్తిపై దీనిని వినియోగించిన సందర్భంగా ‘ఇది క్రూరమైన’ చట్టంగా ఇటీవల సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
సవరణతో విస్తృతమైన చట్టం
సమాజంలో శాంతికి భంగం కలుగుతుందన్నపుడు ప్రత్యేక పరిస్థితుల్లో పీడీ చట్టమనే ఈ బ్రహ్మాస్త్రాన్ని వినియోగించేవారు. గతంలో సారా తయారీదారులు, బందిపోట్లు, మాదక ద్రవ్యాల నేరస్థులు, గూండాలు, అనైతిక కార్యక్రమాలు, భూఆక్రమణలకు పాల్పడేవారు- ఈ ఆరు కేటగిరీలకు చెందినవారిపై వాడేవారు. పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక దాదాపుగా ఈ కేటగిరీల్లోనివారిపైనే ప్రయోగిస్తున్నాయి. వ్యవస్థీకృత నేరాలపై ఉక్కుపాదం మోపాలన్న దృష్టితో తెలంగాణ ప్రభుత్వం తొలుత ఆర్డినెన్స్ తెచ్చి 2018లో ఈ చట్టానికి సవరణ చేసింది. అదనంగా కల్తీ విత్తనాలు, క్రిమిసంహారక మందులు, ఎరువులు, ఆహార పదార్థాల కల్తీ, గేమింగ్, లైంగిక నేరాలు, పేలుళ్లు, ఆయుధాలు, వైట్‌కాలర్, ఆర్థికనేరాలు, అటవీ నేరాలు, నకిలీ పత్రాల తయారీ తదితరాలను దీని పరిధిలోకి తెచ్చింది. 2018లో మొత్తం 385 మందిపై, 2020లో 350 మందిపై ఈ చట్టం కింద కేసులు పెట్టారు.
రాష్ట్రంలో ఆరు నెలల కాలంలో మూడు క్రిమినల్ కేసులు నమోదైతే దీనిని ప్రయోగించడం సాధారణమైంది. ఇలా ప్రామాణికంగా పెట్టుకోవడంపైనా విమర్శలున్నాయి. కొన్ని కేసుల్లో దర్యాప్తు పూర్తికాక అభియోగ పత్రం దాఖలు చేయలేని పక్షంలో అలాంటి వారిపై పీడీ చట్టాన్ని ప్రయోగించి బెయిలు రాకుండా అడ్డుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ శాసనం కింద నిర్బంధం గడువు ముగిసిన తర్వాత తిరిగి దాన్నే వినియోగించిన సందర్భాలున్నాయి.