తెలంగాణ

telangana

ETV Bharat / state

రాచకొండ కమిషనరేట్ పరిధిలో తగ్గిన నేరాల శాతం - telangana varthalu

రాచకొండ కమిషనరేట్ పరిధిలో నేరాల శాతం తగ్గింది. మానవ అక్రమ రవాణాను నిరోధించడానికి ప్రత్యేక బృందాల ఏర్పాటు సత్ఫలితాలనిస్తోంది. నిందితులను శిక్షపడేలా పోలీస్ అధికారులు న్యాయస్థానాల్లో పక్కా సాక్ష్యాలు, ఆధారాలు సమర్పిస్తుండటం వల్ల సగానికి పైగా నేరస్థులకు శిక్షలు పడ్డాయి. లాక్​డౌన్ సమయంలోనూ.. రాచకొండ పోలీసులు వలస కూలీలకు, కార్మికులకు అండగా నిలిచారు.

crime percentage decreased in rachakonda commissionerate
రాచకొండ కమిషనరేట్ పరిధిలో తగ్గిన నేరాల శాతం

By

Published : Dec 29, 2020, 5:01 AM IST

రాచకొండ కమిషనరేట్ పరిధిలో తగ్గిన నేరాల శాతం

నేర నియంత్రణ కోసం రాచకొండ పోలీసులు చేపడుతున్న చర్యలు మంచి ఫలితాలనిస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే నేరాలు 12 శాతం తగ్గాయి. మహిళలపై నేరాలు 11శాతం తగ్గాయి. మానవ అక్రమ రవాణా నిరోధించడానికి రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ చొరవ తీసుకొని ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. 17 వ్యభిచార గృహాలపై దాడులు చేసి ఇతర రాష్ట్రాలకు చెందిన 36మంది బాధితులను ప్రత్యేక బృందం కాపాడి వారిని స్వస్థలాలకు పంపించారు. ఉపాధి చూపిస్తామంటూ పశ్చిమ బంగాల్‌, హిమాచల్ ప్రదేశ్, బంగ్లాదేశ్​కు చెందిన యువతులను తీసుకొచ్చి వ్యభిచార వృత్తి చేయిస్తున్న నిర్వాహకులను అరెస్ట్ చేశారు. వీళ్లపై పీడీ చట్టం కింద కేసు కూడా నమోదు చేశారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది 82మందిపై సీపీ మహేశ్ భగవత్ పీడీ చట్టం ప్రయోగించడం వల్ల తరచూ నేరాలు చేసే వాళ్ల సంఖ్య తగ్గింది.

51శాతం మందికి శిక్ష

నేరాలకు పాల్పడే వాళ్లకు సంబంధించి పక్కా సాక్ష్యాలు, ఆధారాలు సేకరించి న్యాయస్థానాల్లో సమర్పించడంలో.. పోలీసులు సఫలీకృతమవుతున్నారు. ఫలితంగా 51శాతం మందికి శిక్ష పడింది. సంచలనం సృష్టించిన హాజీపూర్ హత్యాచారం కేసులోనూ నిందితుడికి మరణ శిక్ష పడేలా భువనగిరి పోలీసులు చేయగలిగారు. చెడ్డీ గ్యాంగులోని నలుగురు సభ్యులకు 3ఏళ్లు శిక్ష పడేలా రాచకొండ పోలీసులు న్యాయస్థానానికి సాక్ష్యాలు సమర్పించారు. లోక్ అదాలత్ ద్వారా 5 వేల 548 కేసులను పరిష్కారమయ్యేలా చూసి.. రాష్ట్రంలోనే రాచకొండ కమిషనరేట్ మొదటి స్థానంలో నిలిచింది.

రెట్టింపైన సైబర్​ నేరాలు

సైబర్ క్రైం నేరాలు మాత్రం గతేడాదితో పోలిస్తే రెట్టింపయ్యాయి. లాక్​డౌన్ మొదలైన తర్వాత ఏప్రిల్, మే, జూన్ నెలలో అంతర్జాలం విపరీతంగా పెరిగి చాలా మంది వివిధ రూపాల్లో సైబర్ మోసాల బారినపడ్డారు. 704 కేసులు సైబర్ క్రైం పోలీస్ స్టేషన్​లో నమోదయ్యాయి. సీసీ టీవీ కెమెరాల ఏర్పాటుకు పోలీసులు ఎంతో చొరవ తీసుకుంటున్నారు. ఈ ఏడాది 12వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 136 కేసులను సీసీ కెమెరాల ఆధారంగా ఛేదించగలిగారు. డయల్ 100కు 1.66 లక్షల ఫోన్లు రాగా.. గస్తీ బృందాలు 8నిమిషాల్లోపే సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 2 వేల 525 మంది తప్పిపోగా.. వారిలో 2 వేల 233 మందిని గుర్తించి ఇళ్లకు చేర్చారు. రహదారి ప్రమాదాల నివారణ కోసం పోలీసులు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. దీని కోసం మోతాదుకు మించి మద్యం సేవించే వాహనదారులపై కేసులు నమోదు చేస్తున్నారు. 3 వేల202 మందిపై కేసు నమోదు చేసి న్యాయస్థానం ఆదేశాల మేరకు 63లక్షలకు పైగా జరిమానా వసూలు చేశారు. ఫలితంగా గతేడాదితో పోలిస్తే రహదారి ప్రమాదాలు తగ్గాయి. 2047 ప్రమాదాలు చోటు చేసుకోగా 533మంది మృతి చెందారు. గతేడాది ఈ సంఖ్య 739గా ఉంది. రాచకొండ కమిషనరేట్ లో 1052 మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు. 70 మంది పోలీసులు ప్లాస్మా దానం చేశారు. వరదల సమయంలోనూ ప్రజలకు పోలీసులు అండగా నిలిచారు.

నేరాలను అరికట్టేందుకు... సైబర్​ యోధ కార్యక్రమం

పెరిగిపోతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు వచ్చే ఏడాది ప్రత్యేకంగా సైబర్ యోధ కార్యక్రమం నిర్వహించాలని రాచకొండ పోలీసులు నిర్ణయించుకున్నారు. దీని కోసం వాలంటీర్లను ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్లేలా ప్రణాళిక రచిస్తున్నారు.

ఇదీ చూడండి:కేసీఆర్ రైతుల పక్షమా.. మోదీ పక్షమా?: చాడ

ABOUT THE AUTHOR

...view details