తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్ కొవిడ్ రిసోర్సెస్.. గంటకు 5వేల మంది! - telangana latest updates

కొవిడ్‌ బాధితులకు వెలుగు దారుల్ని చూపుతున్నారు హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు అమ్మాయిలు. ‘హైదరాబాద్‌ కొవిడ్‌ రిసోర్సెస్‌’ పేరిట ఓ యాప్‌ని అందుబాటులోకి తెచ్చారు ఈ ఇద్దరు. రెండురోజుల్లోనే ఈ యాప్‌ను 50వేల మంది వినియోగించుకోగా.. ప్రతిగంటకూ 5వేల మంది ఈ యాప్‌ని సందర్శించి సమాచారం తెలుసుకుంటున్నారంటే పరిస్థితి అర్థమవుతోంది. దీనిని ప్రారంభించడానికి కారణాలేంటో వారి మాటల్లోనే తెలుసుకుందాం రండి...!

covid resources app services, Hyderabad covid resources   latest news
కరోనా బాధితులకు సేవలందించే హైదరాబాద్‌ కొవిడ్‌ రిసోర్సెస్, హైదరాబాద్‌ కొవిడ్‌ రిసోర్సెస్ సమాచారం

By

Published : Apr 23, 2021, 12:08 PM IST

‘మా నాన్నకు సీరియస్‌గా ఉంది. ఓ ప్రైవేటు‌ ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. అత్యవసరంగా ప్లాస్మా కావాలి.. దాతలెవరైనా సాయం చేయండి.. ప్లీజ్‌..!' ‘నా స్నేహితుడికి కరోనా సోకింది అత్యవసరంగా రెమిడిసివీర్‌ కావాలని వైద్యులు చెబుతున్నారు. ఎక్కడ దొరుకుతుందో సమాచారం ఇవ్వండి. మా అమ్మకి ఆయాసం ఎక్కువవుతోంది 108 స్పందించట్లేదు.. ఏదైనా అంబులెన్సు సర్వీసు ఉంటే చెప్పండి.’

సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇవే వినతులు. ఆహారం, ఆక్సిజన్‌, ప్లాస్మా, మందులు.. ఒక్కొక్కరిదీ ఒక్కో అవసరం. వాటికోసం చేయని ప్రయత్నం లేదు. అర్థించని చేతుల్లేవు. రోజురోజుకీ విపరీతంగా కేసులు పెరుగుతుండటంతో అన్నింటికీ కొరత ఏర్పడుతోంది. దేనికోసం ఎక్కడ, ఎవరిని, ఎలా సంప్రదించాలి అన్న ప్రశ్నలు తలెత్తినప్పుడు అంతా అగమ్యగోచరం. అవును.. ఎవరిని అడగాలి..? ఈ ప్రశ్నకు సమాధానమై.. దారు చూపుతున్నారు హైదరాబాద్​కు చెందిన ఇద్దరు అమ్మాయిలు. ‘హైదరాబాద్‌ కొవిడ్‌ రిసోర్సెస్‌’ పేరిట తమ విలువైన సేవలు అందిస్తున్నారు. రెండురోజుల్లోనే ఈ యాప్‌ను 50వేల మంది వినియోగించుకోగా.. ప్రతిగంటకూ 5వేల మంది ఈ యాప్‌ని సందర్శించారు.


మేధా ఖాద్రీ.. సామాజిక సేవకురాలు. ఈ కొవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో ఒక్కొక్కరిదీ ఒక్కో కథ. ప్రతి ఇంట్లోనూ తీరని వ్యథ. వారికి భరోసా ఇచ్చేందుకు ఏడాది కాలంగా నగరంలో సేవాకార్యక్రమాల్ని చేస్తున్నారామె. మొదటి దశలో ఆహారం పంపిణీ నుంచి హోమ్‌ ఐసోలేషన్‌ బాధితులకు సాయమందించే వరకూ చేసినా.. రెండో దశలో పరిస్థితి ఊహించని స్థితికి చేరింది. ఎవరికీ ఎక్కడా సరైన సమాచారం అందట్లేదు. దాన్ని తీర్చేందుకు హైదరాబాద్‌ వ్యాప్తంగా ఉన్న సామాజిక సేవా బృందాలు, ఆస్పత్రుల వివరాలు, ఆక్సిజన్‌, చికిత్సకు మందులు, అంబులెన్సులకు సంబంధించిన అన్ని ఫోన్‌ నెంబర్లతో ఓ డేటాబ్యాంకు తయారు చేశారు. నంబర్లు సేకరించి.. అందులో ప్రతి దానికీ ఫోన్‌ చేసి నిర్ధారించుకున్న తర్వాతే ఇందులో పొందుపర్చారు.

ఇతర రాష్ట్రాల నుంచీ...
మేధా ఆలోచనకు తన స్నేహితురాలు, ఐటీ ఉద్యోగిని వెన్సీ కృష్ణ యాప్‌ రూపమిచ్చారు. గత నెలలో వెన్సీ తల్లి కరోనా బారిన పడ్డారు. ఆ సమయంలో సాయం కోసం ఆమె పడిన పాట్లు అన్నీఇన్నీ కావు. ఇంకా చాలామందికి ఇదే పరిస్థితి ఎదురవుతోందని గ్రహించిన వెన్సీ.. మేధా సేకరించిన సమాచారంతో ‘హైదరాబాద్‌ కొవిడ్‌ రిసోర్సెస్‌’ పేరిట యాప్‌ని రూపొందించారు. ఇందులో ఉచిత బెడ్‌లు, ఆక్సిజన్‌ సిలిండర్లు, ఇరవై నాలుగు గంటలూ అందుబాటులో ఉండే సర్వీసులు... ఇలా వివిధ విభాగాల్ని రూపొందించారు. ఈ ఉచిత యాప్‌ ఆవిష్కరించిన కొద్ది గంటల్లోనే వచ్చిన స్పందన వీరికి భరోసానిచ్చింది. బెంగళూరు, ముంబయిలాంటి నగరాల నుంచి ఇలాంటి యాప్‌ మాకూ కావాలంటూ వినతులు వెల్లువెత్తుతున్నాయి. దాంతో ఈ ఆదివారం ఆన్‌లైన్‌ వేదికగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు వెన్సీ.

‘ప్రస్తుతం ఆంగ్లంలో మాత్రమే సమాచారాన్ని ఇస్తున్నాం. శుక్రవారం సాయంత్రానికల్లా తెలుగునీ అందుబాటులోకి తెస్తున్నాం. ఇది అందరికీ ఉపయోగపడాలన్నదే మా ఆకాంక్ష’’ అంటారు మేధా ఖాద్రీ.

ఇదీ చదవండి:కరోనా రోగుల రక్తాన్ని తాగుతున్న కార్పొరేట్​ ఆస్పత్రులు!

ABOUT THE AUTHOR

...view details