తెలంగాణ

telangana

ETV Bharat / state

Covid vaccine for teenagers: జనవరి 3 నుంచి టీనేజర్లకు టీకా... శరవేగంగా సన్నాహాలు..

Covid vaccine for teenagers: టీనేజర్లకు కొవిడ్‌ టీకాలను అందజేయడంపై రాష్ట్ర ఆరోగ్య శాఖ దృష్టి సారించింది. జనవరి 3 నుంచి 15-18 ఏళ్లలోపు వారికి టీకాలు పంపిణీ చేసేందుకు శరవేగంగా సన్నాహాలు చేస్తోంది. వీరితో పాటు 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు, వైద్యులు, నర్సులు, పోలీసులు సహా ఇతర ఫ్రంట్‌లైన్‌ వారియర్లకు బూస్టర్‌ డోసు వేయడానికి ఏర్పాట్లు చేస్తుంది.

Covid vaccines for teenagers
Covid vaccines for teenagers

By

Published : Dec 27, 2021, 7:25 AM IST

Covid vaccine for teenagers: రాష్ట్రంలో ఇప్పటి వరకూ 18 ఏళ్లు పైబడిన వారిలో మాత్రమే కొవిడ్‌ టీకాలను అందజేస్తున్నారు. తొలిసారిగా 15-18 ఏళ్లలోపు టీనేజర్లకూ కొవిడ్‌ టీకాలను అందజేస్తామని తాజాగా ప్రధానమంత్రి మోదీ ప్రకటించడంతో.. ఆ దిశగా ఏర్పాట్లు చేయడంపై ఆరోగ్యశాఖ దృష్టిపెట్టింది. ఈ వయసు టీనేజర్లంటే దాదాపు పదోతరగతి, ఇంటర్మీడియట్‌, డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులే దీని పరిధిలోకి వస్తారు. ఈ కేటగిరీ వయసు వారు తెలంగాణలో 22.78 లక్షల మంది ఉంటారని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు లెక్కగట్టాయి. వీరందరికీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉచితంగా కొవిడ్‌ టీకాను అందజేయనున్నారు. వచ్చే నెల 3వ తేదీ నుంచి వీరికి టీకాలు పంపిణీ చేసేందుకు వైద్యశాఖ శరవేగంగా సన్నాహాలు చేస్తోంది. వీరితో పాటు వచ్చే నెల పదో తేదీ నుంచి 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు, వైద్యులు, నర్సులు, పోలీసులు సహా ఇతర ఫ్రంట్‌లైన్‌ వారియర్లకు కూడా ముందస్తు నివారణ టీకా(బూస్టర్‌) వేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన వారిలో దాదాపు నూటికి నూరు శాతం (99 శాతం పూర్తి) మంది మొదటి డోస్‌ తీసుకోగా.. దాదాపు 64 శాతం మంది రెండో డోసు స్వీకరించారు. ఈ ప్రక్రియను యథాతథంగా కొనసాగిస్తూనే ముందస్తు నివారణ టీకాను కూడా ప్రారంభించాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది.

6-8 వారాల్లో గణనీయంగా కొవిడ్‌ కేసులు...

రాష్ట్రంలో 60 ఏళ్లు పైబడిన వారు 41.60 లక్షల మంది ఉండగా.. వైద్య సిబ్బంది సహా ఇతర ఫ్రంట్‌లైన్‌ వారియర్లు 6.34 లక్షల మంది ఉన్నారు. వీరిలో ప్రాధాన్యత క్రమంలో రెండు డోసులు పూర్తయినవారికి ముందస్తు నివారణ డోసును ఇవ్వనున్నారు. ఈ టీకాను ప్రైవేటులోనూ కొనసాగిస్తారా? లేదా? అనే స్పష్టత ఇంకా రాలేదు. మరోవైపు టీనేజర్లకు టీకాలు ఇవ్వడానికి ఆరోగ్యశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. పాఠశాలలు, కళాశాలల్లోనే టీకాల పంపిణీ చేయడంపై దృష్టిపెట్టింది. పిల్లల్లో తొలిసారి కావడంతో వారికి టీకాలిచ్చే క్రమంలో చిన్నపాటి దుష్ఫలితాలు వచ్చినా.. పెద్దగా ఆందోళన వ్యక్తమయ్యే అవకాశాలుండడంతో.. ఈ కోణంలోనూ ఆలోచించి టీకాల పంపిణీలో తగు జాగ్రత్తలు చేపట్టాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. వచ్చే 6-8 వారాల్లో కొవిడ్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయని ఒకవైపు ఆరోగ్యశాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీచేసింది. ఈ నేపథ్యంలో టీకాలను పొందడానికి అర్హులైన లబ్ధిదారులంతా తప్పనిసరిగా ముందుకు రావాలని, అనవసరమైన భయాందోళనలను వీడాలని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు తెలిపారు. టీకాలను పొందడం ద్వారా కొవిడ్‌ నుంచి రక్షణ లభిస్తుందని, ఇదే సమయంలో మాస్కు ధరించడం, వ్యక్తిగత దూరాన్ని పాటించడం వంటి కొవిడ్‌ నిబంధనలూ పాటించాలని ఆయన కోరారు.

ఇదీ చదవండి:15-18 ఏళ్ల వారికి ప్రస్తుతానికి ఆ వ్యాక్సిన్​ మాత్రమే

ABOUT THE AUTHOR

...view details