తెలంగాణ

telangana

ETV Bharat / state

రోడ్లపైకి విచ్చలవిడిగా కరోనా బాధితులు.. పట్టించుకోని అధికారులు - hyderabad covid 19 updates

రాష్ట్ర రాజధానితోపాటు చుట్టుపక్కల జిల్లాల్లో కరోనా వైరస్‌ నిరోధంలో పోలీసులు కీలక భూమిక పోషించారు. మూడు పోలీసు కమిషనరేట్లలోని వేలాది మంది రాత్రనకా పగలనకా శ్రమించారు. రెండు నెలలపాటు కుటుంబానికి దూరంగా ఉన్నారు. అటువంటి పోలీసులు నగరంలో ఇప్పుడు కరోనా వైరస్‌ జడలు విప్పి అనేకమందిని వ్యాధిగ్రస్తులుగా మారుస్తున్నా నియంత్రణ ప్రక్రియకు దూరంగా ఉంటున్నారు. నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులకు జరిమానాలు వేయడానికే పరిమితం అవుతున్నారు.

coronavirus
coronavirus

By

Published : Jul 22, 2020, 7:20 AM IST

కరోనా వైరస్‌ కట్టడి కోసం మార్చి నెలలో కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించడంతో అప్పటి నుంచి జూన్‌ మధ్య వరకు పోలీసులంతా రోడ్లమీదే ఉన్నారు.

హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో దాదాపు 20 వేల మంది పోలీసులు ఉన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో నగరంలో 50 లక్షల వాహనాలను రోడెక్కకుండా చర్యలు తీసుకున్నారు.

వేలాది కాలనీల నుంచి లక్షల మంది జనాన్ని రోడ్ల మీదకు రాకుండా అడ్డుకున్నారు. కంటెయిన్‌మెంట్‌ జోన్లను ఏర్పాటు చేసి ఆ ప్రాంతం నుంచి ఏ ఒక్కరిని బయటకు రాకుండా చేశారు.

దాంతో వైరస్‌ వెలుగులోకి వచ్చిన తొలినాళ్లలో హైదరాబాద్‌తోపాటు చుట్టుపక్కల జిల్లాల్లో చాలావరకు కొవిడ్‌ వైరస్‌కు అడ్డుకట్ట పడింది.

పట్టించుకోవడం లేదు

ఇలా విధుల్లో తీరిక లేకుండా ఉన్న దాదాపు 450 మంది పోలీసులు మూడు కమిషనరేట్లలో కరోనా బారిన పడ్డారు. ఐపీఎస్‌ అధికారుల నుంచి కానిస్టేబుల్‌, హోంగార్డు వరకు బాధితులు ఉన్నారు.

ఇలా పెద్ద సంఖ్యలో పోలీసులకే వైరస్‌ సోకిన నేపథ్యంలో గత నెల రోజులుగా పోలీసులు కరోనా వైరస్‌ కట్టడి నుంచి దాదాపు తమ సేవలను ఉపసరహరించుకున్నట్లే కనిపిస్తోంది.

కాలనీలు, ఇతరత్రా ప్రాంతాల్లో జనం విచ్చలవిడిగా తిరుగుతున్నా.. వందల మంది జన్మదిన, ఇతరత్రా వేడుకల్లో పెద్దఎత్తున పాల్గొంటున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు.

నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న వేడుకలను అడ్డకట్ట వేస్తే కరోనా బాధితుల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.

ఎలాంటి తోడ్పాటు కావాలన్నా అందిస్తాం

లాక్‌డౌన్‌ నుంచి మొదలు ఇప్పటి వరకు రాత్రి పగలూ తేడా లేకుండా నగర పోలీసులు వైరస్‌ అడ్డుకట్టలో భాగమయ్యారు. ఇప్పుడూ ఇదే దిశలో పోలీసులు వెళుతున్నారు.

కాల్‌సెంటర్‌కు రోగుల నుంచి వచ్చే ఫోన్లకు స్థానిక పోలీసు స్టేషన్లు స్పందిస్తున్నాయి. వారికి తోడ్పాటు అందించేందుకు నగర పోలీసులు సహకరిస్తున్నారు.

ఎవరికి ఎటువంటి తోడ్పాటు కావాలన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కరోనా వైరస్‌ విస్తరించకుండా ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పని చేస్తున్నాం.

- అంజనీకుమార్‌, హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌

మా ప్రయత్నం మేం చేస్తున్నాం

కరోనా వైరస్‌ నిరోధించేందుకు సైబరాబాద్‌ పోలీసులు తమవంతు పాత్ర పోషిస్తున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో నగరంలోని సంస్థలు ఇతర వ్యక్తుల సహకారంతో లక్షలాది మందికి ఆపన్న హస్తం అందించాం.

అనేకమందికి ఆహారం సమకూర్చాం. ఇప్పుడు కొవిడ్‌ నిరోధంలో భాగంగా మాస్కులు పెట్టుకోకుండా రోడ్ల మీదకు వస్తున్న వాహనదారులు, ఇతరులపై కేసు నమోదు చేస్తున్నాం. ఎక్కడా భారీ ఎత్తున జనం గుమిగూడకుండా మా ప్రయత్నాలు మేం చేస్తున్నాం.

-సజ్జనార్‌, సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌

రోగులకు అండగా ఉంటున్నాం

కరోనా పాజిటివ్‌ వచ్చిన వెంటనే సంబంధిత రోగులతో మా కమిషనరేట్లలోని ఇద్దరు వైద్యులు మాట్లాడి మనోధైర్యం నింపుతున్నారు. అవసరం ఉంటే ఆస్పత్రిలో చేర్చడానికి కృషి చేస్తున్నాం.

తక్కువ లక్షణాలు ఉన్న వారికి మందుల కిట్స్‌ పంపించే ఏర్పాట్లు చేస్తున్నాం. కమిషనరేట్‌ పరిధిలోనూ రోగులందరితో నాతో పాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులు సెల్‌ఫోన్‌ కాన్ఫరెన్సులో మాట్లాడి ధైర్యాన్ని అందిస్తున్నాం.

రోగులందరితో ఒక వాట్సాప్‌ గ్రూపు ఏర్పాటు చేసి అవసరమైన సమాచారాన్ని అందులో పోస్టు చేసి వారికి అన్ని రకాల తోడ్పాటు ఇస్తున్నాం.

- మహేష్‌ భగవత్‌, రాచకొండ పోలీసు కమిషనర్‌

పాజిటివ్‌ రోగులపై దృష్టి సారిస్తేనే...

మహా నగరంలో దాదాపు పది వేల మంది ఇంట్లోనే ఉండి వైద్యం పొందుతున్నారు. గతంలో అధికంగా వైరస్‌ వ్యాప్తి చెందిన ప్రాంతాలను కంటెయిన్‌మెంట్‌ జోన్లుగా ప్రకటించారు.

ఆ ప్రాంతం వారిని ఇళ్ల నుంచి బయటకు రాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు పాజిటివ్‌ వచ్చిన రోగులపై నిఘా లేకపోవడంతో విచ్చలవిడిగా తిరుగుతున్నారు.

మూడు పోలీసు కమిషనరేట్ల పోలీసులు వీరిపై దృష్టి సారించి ప్రతి రోగి కనీసం 17 రోజులపాటు బయటకు రాకుండా చేస్తే వైరస్‌కు కొంతమేర అడ్డకట్ట పడే అవకాశం ఉంది.

చాలామంది కుటుంబ, ఇతరత్రా వేడుకలకు హాజరువుతున్నందు వల్ల ఇలాంటి వారిపై నిఘా పెట్టి నిరోధానికి చర్యలకు తీసుకుంటే కొంత ఫలితం వచ్చే అవకాశం ఉంది.

గతంలో కరోనా పాజిటివ్‌ అని తెలిసిన వెంటనే సంబంధిత రోగికి ఆయా పోలీసు స్టేషన్‌ నుంచే ముందుగా కాల్‌ వెళ్లేది. ఇప్పుడు పరీక్ష చేయించుకున్న రెండు, మూడు రోజులకు గానీ నివేదిక రావడం లేదు. వచ్చినా ఏ ఆస్పత్రికి ఎలా వెళ్లాలో రోగులకు తెలియని పరిస్థితి.

ABOUT THE AUTHOR

...view details