తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా ఎక్కడొచ్చినా.. తెలుగు రాష్ట్రాల్లో కలవరమే.. - కరోనా వైరస్​ ఎంత మందికి సోకిందంటే?

ప్రపంచాన్ని ఇప్పుడు కరోనా వైరస్​ గడగడలాడిస్తోంది. యూరప్​లో వేల మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. వారిలో 20 శాతం తెలుగు రాష్ట్రాల విద్యార్థులు. అయితే ఆ దేశాల్లో వైరస్​ వ్యాప్తి చెందుతుండటం వల్ల వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

corona-virus-tension-in-telugu-states
కరోనా ఎక్కడొచ్చినా.. తెలుగు రాష్ట్రాల్లో కలవరమే..

By

Published : Mar 18, 2020, 9:52 AM IST

యూరప్‌ ఖండంలోని పలు దేశాల్లో కరోనా విజృంభిస్తుండటం వల్ల తెలుగు రాష్ట్రాల్లో వేల మంది తల్లిదండ్రులు తీవ్రంగా కలవరపడుతున్నారు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాలోనే కాకుండా.. యూరప్‌ దేశాల్లోనూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన వారు అధిక సంఖ్యలో ఉన్నత విద్యనభ్యసిస్తున్నారు. దీనితో తమ పిల్లలు అక్కడ ఎలా ఉన్నారోనని నిత్యం ఇక్కడ తల్లిదండ్రులు ఆరా తీస్తున్నారు.

కరోనా వైరస్‌ శరవేగంగా వ్యాపిస్తూ వందల మంది ప్రాణాలు కోల్పోతుండటం వల్ల పలువురు విద్యార్థులు స్వదేశానికి కూడా రాలేని పరిస్థితి మరింత ఆందోళన కలిగిస్తోంది. భారతీయ విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా 90 దేశాల్లో ఉన్నట్లు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ గణాంకాలు పేర్కొంటున్నాయి. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో పెద్దసంఖ్యలో మన విద్యార్థులున్నారు. వాటితో పాటు యూరప్‌ దేశాలైన యూకే సహా ఇతర 15 దేశాల్లోనూ అధిక సంఖ్యలో చదువుతున్నారు. వాటిల్లో ఒక్క బ్రిటన్‌ 2018 ఏప్రిల్‌ నుంచి 2019 మార్చి వరకు 21,115 మంది భారతీయ విద్యార్థులకు వీసాలు జారీ చేసింది. యూరప్‌లో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సంఖ్య కనీసం 20 శాతం ఉంటుందని నిపుణుల అంచనా.

ఆ దేశాలకే ఎందుకంటే?

  1. యూరప్‌ దేశాల్లో బ్రిటన్‌ తప్ప పలుచోట్ల ఫీజులు తక్కువ. కొన్ని దేశాల్లో అవీ లేవు.
  2. విభాగాల వారీగా నాణ్యమైన విద్య అందే దేశాలను ఎంచుకుంటున్నారు. ఉదాహరణకు మెకానికల్‌ ఇంజినీరింగ్‌ కోసం జర్మనీ వెళ్లే వారి సంఖ్య ఎక్కువ.
  3. తెలుగు రాష్ట్రాల్లో ఎంటెక్‌ పూర్తిచేసిన వారు పీహెచ్‌డీ, పోస్టు డాక్టొరల్‌ ఫెలోషిప్‌(పీడీఎఫ్‌) కోసం యూరప్‌ దేశాలనే అధికంగా ఎంచుకుంటున్నారు.
  4. జేఎన్‌టీయూ హైదరాబాద్‌, కాకినాడ వర్సిటీలకు స్వీడన్‌లోని బ్లెకింగ్‌ విశ్వవిద్యాలయంతో ఒప్పందాలున్నాయి. ఇక్కడ క్యాంపస్‌లో రెండేళ్ల తర్వాత మరో రెండేళ్లు స్వీడన్‌లో చదువుతారు. ఇలా ప్రతిఏటా తెలుగు రాష్ట్రాల నుంచి 100 మంది వరకు అక్కడికి వెళతారు.
  5. 26న రావాల్సింది... ప్రయాణాన్ని రద్దు చేసుకున్నాడు.

మా అబ్బాయి రాజేష్‌ ఫిన్లాండ్‌లో పీహెచ్‌డీ చేస్తున్నాడు. ఈ నెల 26న హైదరాబాద్‌కు రావాల్సి ఉంది. కరోనా నేపథ్యంలో ప్రయాణాన్ని రద్దు చేసుకున్నాడు. కరోనా కారణంగా అక్కడి వర్సిటీలకు ఇప్పటికే సెలవులు ప్రకటించారు. -కొప్పోలు రవికుమార్‌, విద్యార్థి తండ్రి, హైదరాబాద్‌

బ్రిటన్‌లో అంతగా ఆందోళన పరిస్థితుల్లేవు

నేను బ్రిటన్‌లోని మాంచెస్టర్‌లో పోస్టు డాక్టొరల్‌ ఫెలోషిప్‌(పీడీఎఫ్‌) చేస్తున్నాను. వరంగల్‌ జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లి సొంతూరు. ఇక్కడ కరోనాపై ఆందోళన పరిస్థితి లేదు. కాకపోతే ముందుజాగ్రత్త చర్యగా పాఠశాలల్లో రద్దుచేసి ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహిస్తామని ప్రకటించారు. -డాక్టర్‌ గౌతమ్‌, పీడీఎఫ్‌, మాంచెస్టర్‌

ఇదీ చూడండి:'కరోనా వచ్చినా భయపడొద్దు.. ఇలా చేస్తే సరి'

ABOUT THE AUTHOR

...view details