ఇంట్లో ఒకరు కరోనా కోరల్లో చిక్కుకున్నా కుటుంబమంతా రాకాసి బారిన పడే పరిస్థితి. దురదృష్టవశాత్తు ఎవరు ప్రాణాలు విడిచినా కనీసం కడసారి చూపుకైనా నోచుకోని దుస్థితి. ఎవరి నుంచి వస్తుందో అంతుచిక్కదు. ఎవరిని బలిగొంటుందో తెలియదు. కరోనా విజృంభణతో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల నెలకొన్న విషాదగాథలివి. జిల్లాల్లో రోజురోజుకు రికార్డు స్థాయిలో పెరుగుతున్న కేసులు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.
విజృంభిస్తోన్న కరోనా
నిజామాబాద్ జిల్లాలో రోజుకు 5 నుంచి 8మంది వరకు కరోనాతో మృత్యువాత పడుతున్నారు. వందల సంఖ్య కేసులు నమోదవుతున్నాయి. శనివారం 3,912మందికి పరీక్షలు నిర్వహించగా... 763మందికి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇందల్వాయి మండలంలో 4 రోజుల వ్యవధిలోనే దంపతులు ప్రాణాలు కోల్పోయారు. వారి కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నవీపేటలో కరోనా లక్షణాలతో మృతిచెందిన ఓ వ్యక్తి అంత్యక్రియలు జరిపేందుకు కుటుంబసభ్యులు ముందుకు రాకపోవటం వల్ల గ్రామ ఉపసర్పంచ్ దహనసంస్కారాలు పూర్తి చేశారు. జక్రాన్‌పల్లి ఠాణాకు చెందిన కానిస్టేబుల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ధర్‌పల్లి, డిచ్‌పల్లి మండలాలకు చెందిన ఇద్దరు పాత్రికేయులు వైరస్‌బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ధర్పల్లి మండలం దుబ్బాకలో భారీగా కేసులు నమోదవటంతో... ఎస్సీ వాడను మైక్రో కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించారు.
ప్రాణాలతో చెలగాటమాడుతోంది..
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం మంతపురి గ్రామ సర్పంచ్ మాధవి కొవిడ్ కాటుతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ... మృతిచెందారు. ఆమె భర్త హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో వారం వ్యవధిలో భార్యాభర్తలు ప్రాణాలు కోల్పోవటం తీవ్రవిషాదాన్ని నింపింది. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండల పరిషత్ కార్యాలయంలో పనిచేసే ఓ వ్యక్తికి కరోనా సోకి... కుటుంబానికి వ్యాపించింది. ఈ క్రమంలో వారి తొమ్మిది నెలల బాబు వైరస్ బారిన పడి... ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. మంచిర్యాలలో కరోనా కేసుల దృష్ట్యా... పట్టణంలోని క్లబ్ భవనాన్ని వంద పడకలతో క్వారంటైన్ కేంద్రంగా ఏర్పాటు చేశారు. ఇళ్లలో ఉండలేని కరోనా బాధితుల కోసం ఇక్కడ అన్ని సదుపాయాలు కల్పించారు. ఆదిలాబాద్‌లో కరోనా మృతులకు అంత్యక్రియలు జరుపుతున్న పారిశుద్ధ్య కార్మికులను స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న సన్మానించారు.
వారాంతపు లాక్‌డౌన్