తెలంగాణలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా సాగింది. తొలిరోజు ఒక్కో కేంద్రంలో 30 మంది చొప్పున టీకాలు వేయగా... ఆ సంఖ్యను 50కి పెంచారు. సోమవారం 335 కేంద్రాల్లో కరోనా టీకా ఇచ్చారు. ఈ రోజు 13,666 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. టీకా తీసుకున్న వారిలో 15 మందికి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వారందరి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. రేపటి నుంచి ప్రతి కేంద్రంలో రోజుకి 100 మందికి వాక్సిన్ ఇవ్వనున్నారు.
వరంగల్ అర్బన్ జిల్లాలో అత్యధికం
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు వ్యాక్సినేషన్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా శాయంపేట యూపీహెచ్‌సీలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ వ్యాక్సినేషన్‌కు శ్రీకారం చుట్టారు. మొదటిరోజుతో పోలిస్తే.. రెండోరోజు జిల్లాల్లో కేంద్రాల సంఖ్య పెంచారు. తొలిరోజు వరంగల్ జిల్లా వ్యాప్తంగా 21 కేంద్రాల్లో టీకా వేయగా... రెండోరోజు.. 45 కేంద్రాలు ఏర్పాటు చేశారు. వరంగల్ అర్బన్ జిల్లాలో అత్యధికంగా 14 ఆరోగ్య కేంద్రాల్లో టీకా వేస్తున్నారు.
వ్యాక్సినేషన్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు
నిజామాబాద్ జిల్లాలో 14, కామారెడ్డి జిల్లాలో 7 కేంద్రాల్లో వ్యాక్సిన్ పంపిణీ చేశారు. మొదటి రోజు ఉమ్మడి జిల్లాలో 10 కేంద్రాల్లో టీకాలు వేయగా.. రెండోరోజు 21 కేంద్రాలకు విస్తరించారు. ప్రతి కేంద్రంలో 30 నుంచి 50మందికి వ్యాక్సిన్ వేస్తున్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ప్రభుత్వాస్పత్రిలో మున్సిపల్ ఛైర్మన్, డిప్యూటీ డీఎంహెచ్‌వో వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. కరీంనగర్ జిల్లా మానకొండూరులో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా మంథని ప్రభుత్వ వైద్యశాలలో స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో రెండోరోజు టీకాల ప్రక్రియ ప్రారంభించారు.