హైదరాబాద్‌లో కరోనా కేసుల పరంపర కొనసాగుతోంది. కరోనాతో ముందు వరుసలో ఉండి పోరాడుతున్న వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు, జర్నలిస్టులు కరోనా బారిన పడుతున్నారు. రాంనగర్లో ఇటీవల కరోనాతో మరణించిన ఓ వ్యక్తి కుటుంబంలో మొత్తం 13 మందికి కరోనా సోకినట్లు అధికారులు వెల్లడించారు. గతంలో ఇదే కుటుంబంలో 9 మందికి వైరస్ సోకగా తాజాగా ముగ్గురికి సోకింది. నగరంలోని మాదన్నపేటకు చెందిన యువ జర్నలిస్టు కరోనా చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం గాంధీ ఆసుపత్రిలో మరణించారు. నాలుగు రోజుల క్రితం కరోనా సోకడం వల్ల అప్పటి నుంచి గాంధీలో చికిత్స పొందుతున్నాడు. ఇవాళ ఉదయం 8 గంటలకు వెంటిలేటర్ పెట్టామని... కాసేపటికే చికిత్స పొందుతూ మృతి చెందినట్లు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. మృతుడు మయస్తీనియా గ్రేవిస్ అనే నరాల బలహీనత వ్యాధితో కూడా బాధపడుతున్నట్లు వైద్యులు వెల్లడించారు.
మేయర్ బొంతు రామ్మోహన్‌కు కరోనా పరీక్షలు
జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్‌కు వైద్యులు కరోనా వైద్య పరీక్షలు చేశారు. వైద్య పరీక్షల్లో మేయర్‌కు నెగిటివ్‌గా నిర్ధరణ అయింది. ఇటీవల నగరంలో పర్యటించిన సందర్బంగా రాంనగర్‌లోని ఓ హోటల్లో మేయర్ టీ తాగారు. ఆ టీ దుకాణంలో పనిచేసే మాస్టర్‌కు కరోనా రావడం వల్ల ముందు జాగ్రత్తగా మేయర్‌కు కరోనా పరీక్ష నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. రాంనగర్లో ఇవాళ మరో 8 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాంనగర్‌లోని ఫ్రెండ్స్ కాలనీలోని ఇద్దరు యువ వైద్యులకు, నిమ్స్ ఆస్పత్రిలో పనిచేసే సిస్టర్‌కు కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు.