హైదరాబాద్ ఖైరతాబాద్ ఆనంద్‌నగర్ కాలనీకి చెందిన వ్యక్తికి కొద్దిరోజుల క్రితం ఊపిరి తీసుకోవడం కష్టమైంది. రాత్రికి రాత్రి ప్రైవేటు ఆసుపత్రుల చుట్టూ తిరిగినా పడక లభించలేదు. చివరికి నిమ్స్‌లో చేరాడు. అప్పటికే వ్యాధి ముదరడం వల్ల కాసేపటికే చనిపోయాడు. పరీక్ష చేస్తే కరోనా పాజిటివ్‌గా తేలింది. వారంపాటు వైరస్ లక్షణాలు ఉన్నాయని చెబుతున్నారు. ముందుగానే మేల్కొని పరీక్ష చేయించుకుంటే ప్రాణం నిలిచి ఉండేదని వైద్యులు తెలిపారు.
రాజేంద్రనగర్ మండలానికి చెందిన మహిళకు కరోనా సోకింది. అది గుర్తించక ఆలస్యంగా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. అప్పటికే నిమోనియాతో ఊపిరితిత్తులు పని చేయడం లేదు. సకాలంలో పరీక్ష చేయించుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు.
సాధారణ జ్వరంగా భావిస్తూ..
నగరంలో ప్రస్తుతం 20 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఐదు వేల మంది వరకు ఉన్నారు. మిగిలిన వారు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. వైరస్ అధికమై శరీరంలోని కొన్ని అవయవాలు స్పందించని స్థితిలో అనేకమంది పడకలపై కనిపిస్తున్నారు. దీనిపై వైద్యులు ఆరా తీస్తే చాలా మంది కరోనా లక్షణాలు ఉన్నా పరీక్ష చేయించుకోవడానికి ముందుకు రాకపోవడమే కారణమని తేలింది.
తమకు వచ్చింది సాధారణ జ్వరంగానే కొందరు భావించగా.. అధికంగా పని చేయడం వల్లనో, ఇతర కారణాల వల్లో వచ్చిందని మరికొందరు తమను తామే సమాధానపర్చుకున్నారు. దీంతో శరీరంలో వైరస్ ఉద్ధృతంగా మారి ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తోంది. ఒక్కసారిగా శ్వాస అందక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పరిస్థితి విషమంగా మారిన తర్వాత ఆసుపత్రుల వైపు పరుగులు తీస్తున్నారు. గత నెల రోజుల్లో ఇలా చనిపోయిన రోగుల సంఖ్య అధికంగా ఉంది. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, వాసన కోల్పోవడం వంటి లక్షణాలున్నప్పుడు తక్షణం పరీక్షలు చేయించుకుంటే ఇబ్బందే ఉండదని వైద్యులు చెబుతున్నారు. పాజిటివ్ వచ్చినా పెద్దగా లక్షణాలు లేకపోతే ఇంట్లోనే ఉండి వైద్యుల పర్యవేక్షణలో 14 రోజులు చికిత్స తీసుకుంటే సరిపోతుంది.