తెలంగాణ

telangana

ETV Bharat / state

వస్తూ వస్తూ.. తమతో కరోనాను వెంటబెట్టుకొచ్చారు! - corona spreads due to migrant workers come back in telangana

ఇప్పుడిప్పుడే కరోనా కోరల నుంచి నెమ్మదిగా బయటపడుతున్న తెలంగాణను ఓ వైపు వలస కార్మికులు, మరోవైపు విదేశాల నుంచి తిరిగొస్తున్న వారు ఆందోళనకు గురిచేస్తున్నారు. వస్తూ వస్తూ తమతో కరోనాను వెంటబెట్టుకొని వస్తున్నారు.

corona is spreading in telangana due to Indians who has come back from foreign
కరోనాను వెంటబెట్టుకొచ్చారు!

By

Published : May 26, 2020, 9:41 AM IST

కరోనా వల్ల విదేశాల్లో చిక్కుకుపోయి, ప్రత్యేక విమానాల్లో నగరానికి వచ్చిన వారిలో 18 మందికి కొవిడ్‌-19 పాజిటివ్‌ నిర్ధారణ అయింది. క్వారంటైన్లలో ఉంటున్న వీరిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. హోటళ్ల సిబ్బందికి స్వీయ నిర్బంధం విధించారు. గాంధీలో చికిత్స పొందుతూ సోమవారం ముగ్గురు కన్నుమూయగా, నగరంలో మరో 31 మందికి కరోనా నిర్ధారణ అయింది. బంజారాహిల్స్‌లోని ప్రైవేటు ఆసుపత్రి వైద్యుడు(29) వైరస్‌ బారిన పడ్డారు.

782 మందికి క్వారంటైన్‌ ముద్రలు

అమీర్‌పేట: విదేశాల నుంచి వచ్చి హోటళ్లలో బస చేసిన 782 మందికి సోమవారం క్వారంటైన్‌ ముద్రలు వేశారు. పాజిటివ్‌ వచ్చిన 18 మందిని గాంధీకి తరలించారు.

బీమా ఉద్యోగికి

గోషామహల్‌: బేగంబజార్‌కు చెందిన ఓ వ్యక్తి(53) ప్రభుత్వ రంగ బీమా సంస్థలో క్యాషియర్‌గా పనిచేస్తున్నారు. అనారోగ్యానికి గురై నాంపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లారు. కరోనా పాజిటివ్‌ రావడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు.

జియాగూడలో వృద్ధురాలి మృతి

జియాగూడ: గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జియాగూడ ఎల్‌.ఎన్‌.నగర్‌ ప్రాంతానికి చెందిన వృద్ధురాలు(70) సోమవారం మృతి చెందింది. 20 రోజుల క్రితం ఆమె భర్త గుండెపోటుతో చనిపోయాడు. ఆమె కుమారుడు జియాగూడ శ్రీసాయినగర్‌లో కరోనా సోకిన వ్యక్తి ఇంట్లో అద్దెకు ఉండేవాడని, అతని ద్వారా భార్య, కుమార్తెకు వైరస్‌ సోకింది. వారి ద్వారా ఈ వృద్ధురాలికి వైరస్‌ వచ్చింది.

బాధితురాలి ఇంట్లో అద్దెకుంటున్న ఇద్దరికి

వెంగళ్‌రావునగర్‌, నల్లకుంట: అల్లాపూర్‌ డివిజన్‌ ఆర్పీనగర్‌కు చెందిన మహిళకు ఈనెల 20న కరోనా సోకింది. ఆమె ఇంట్లో అద్దెకుంటున్న వ్యక్తి(38)తో పాటు బాలిక(9)కి పాజిటివ్‌ వచ్చింది. సోమవారం 11 మంది అనుమానితులు నల్లకుంటలోని ఫీవరాసుపత్రిలో చేరారు. ఎర్రగడ్డ డివిజన్‌లో కరోనా బాధితురాలి సోదరికి(36) పాజిటివ్‌ వచ్చింది. నగరంలోని బంధువుల ఇంట్లో ఉంటున్న ఆదిలాబాద్‌ జిల్లా బోధ్‌ చెందిన మహిళ(55)కు పాజిటివ్‌ వచ్చింది.

ఇద్దరు కానిస్టేబుళ్లకు

చాంద్రాయణగుట్ట, కాచిగూడ, అంబర్‌పేట: ఛత్రినాక ఠాణా పరిధిలోని శివగంగానగర్‌లో నివసించే సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్సు కానిస్టేబుల్‌(35)కు వైరస్‌ సోకింది. ఇతను గాంధీ ఆసుపత్రి వద్ద విధుల్లో ఉంటున్నారు. నగర పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో పనిచేస్తూ కాచిగూడ ఠాణా పరిధిలో ఉండే కానిస్టేబుల్‌(32)తో పాటు ఆయన భార్య, స్నేహితుడుకి కరోనా నిర్ధారణ అయింది. గోల్నాక సుందర్‌నగర్‌లో కొవిడ్‌-19 బారిన పడిన వృద్ధుడి(78) ద్వారా చిన్న కుమారుడు(42), చెల్లెలు(56)కి సోకింది. అంబర్‌పేట పరిధి గోల్నాక మారుతీనగర్‌లో నివసించే కానిస్టేబుల్‌ బంధువు(42)కు వైరస్‌ వ్యాపించింది.

ఒకే ఇంట్లో నలుగురికి

షాద్‌నగర్‌, ఆర్కేపురం: షాద్‌నగర్‌లో ఇద్దరు ఇప్పటికే కరోనా బారిన పడగా ఆ కుటుంబంలో మరో ఇద్దరికి వైరస్‌ సోకింది. మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్‌ ఎన్టీఆర్‌ నగర్‌ ఫేజ్‌-1లో ఓ వ్యక్తి(45)కి నిర్ధారణ అయింది.

తండ్రి నుంచి కుమారుడికి..

రాంనగర్‌: ముషీరాబాద్‌ డివిజన్‌కు చెందిన కరోనా బాధితుడి కుమారుడు(14) వైరస్‌ బారిన పడ్డాడు. ఓ ప్రైవేటు ఆస్పత్రి హౌస్‌కీపింగ్‌ విభాగంలో పనిచేసే వ్యక్తి(47)ని గాంధీకి ఆసుపత్రికి పంపగా పరీక్షించి పాజిటివ్‌గా నిర్ధారించారు.

ABOUT THE AUTHOR

...view details