కరోనా వైరస్ ఫలానా వస్తువులపై ఇన్ని గంటలు బతికుంటుందనే విషయాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చెబుతూనే ఉంది. దుస్తులు, వస్త్రాలపై కరోనా వైరస్ కొన్ని గంటల పాటు బతికుంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కరోనా ఈ స్థాయిలో విజృంభిస్తోన్న వేళ ప్రతి రోజూ మీరు ఉపయోగించే టవల్ విషయంలో ఎంత వరకు జాగ్రత్త వహిస్తున్నారు? ఇంతకీ టవళ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకపోతే కలిగే నష్టాలేంటి..? వీటిని అధిగమించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి నిద్రపోయే వరకు రోజులో ఎన్నోసార్లు ముఖాన్ని, చేతుల్ని కడుక్కుంటూ ఉంటాం. ఇలా కడిగిన ప్రతిసారీ కచ్చితంగా టవల్‌తో తుడుచుకోవాల్సిందే. ఇలా మనకు తెలియకుండానే రోజులో చాలాసార్లు టవల్‌ను వాడుతూనే ఉంటాం. మరి, మీరు నిత్యం ఉపయోగించే ఈ టవళ్లు బ్యాక్టీరియాలకు మంచి ఆవాసాలనే విషయం మీకు తెలుసా?
90 శాతం టవల్స్‌లో..
యూనివర్సిటీ ఆఫ్ అరిజోనాకు చెందిన పరిశోధకుల అధ్యయనంలో తేలిన వివరాల ప్రకారం.. దాదాపు 90 శాతం టవళ్లలో కోలీఫామ్ అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఇలాంటి క్రిములు, బ్యాక్టీరియాలు ఆవాసం ఏర్పరచుకున్న టవల్స్‌తో శరీరాన్ని తుడుచుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుకే ఎప్పటికప్పుడు టవల్స్‌ను శుభ్రం చేసుకోవడం ద్వారా ఇన్ఫెక్షన్లను తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా కరోనా లాంటి ప్రమాదకర వైరస్‌లు విజృంభిస్తోన్న వేళ మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచిస్తున్నారు.
క్రమం తప్పకుండా..
టవల్స్‌తో పాటు చేతి రుమాళ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఒక టవల్‌ను ఉతకకుండా ఐదు కంటే ఎక్కువసార్లు ఉపయోగించకూడదు. అయితే ఏదో మొక్కుబడిగా కాకుండా వేడి నీటిలో నానబెట్టి మంచి డిటర్జెంట్‌తో ఉతకాలి.
తడి టవల్‌ను అలా వేయకూడదు..
మనలో దాదాపు చాలా మంది చేసే తప్పే ఇది. టవల్‌తో తడి శరీరాన్ని తుడిచిన తర్వాత బెడ్‌పై వేసే అలవాటు చాలామందికి ఉంటుంది. అయితే టవల్‌లో బ్యాక్టీరియా వృద్ధి చెందడానికి ఇదే ముఖ్య కారణమని గుర్తుంచుకోండి. తడిగా ఉన్న టవల్‌ను వీలైతే ఆరు బయట ఎండలో ఆరేయడానికి ప్రయత్నించాలి. కుదరని పక్షంలో ఇంట్లోనే ఫ్యాన్ గాలికి ఆరేయాలి. టవల్‌కు ఉండే తడి వీలైనంత త్వరగా ఆరిపోయేలా చూసుకోవాలి.