హైదరాబాద్ నగర శివారులోని పోచారం మున్సిపాలిటీలోని సంస్కృతి టౌన్షిప్. నిన్న మొన్నటి వరకు ఉదయం లేచినప్పట్నుంచి రాత్రి వరకు కార్యాలయాలకు వెళ్లి వచ్చే ఐటీ ఉద్యోగులతో కళకళలాడేది. లాక్డౌన్ అమల్లోకి వచ్చి ఐటీ కంపెనీలు ఉద్యోగులకు ఇంటి నుంచి పనికి అనుమతించాయి. తిరిగి పరిస్థితులు ఎప్పటికీ చక్కబడతాయో తెలియని పరిస్థితి. కొందరు ఐటీ ఉద్యోగులు ఇక్కడ ఇళ్లు తీసుకుని ఉండేవారు. బ్యాచిలర్స్ అయితే నలుగురైదుగురు కలిసి ఉండేవారు. ఇప్పుడు వారందరూ ఇళ్లు ఖాళీచేసి సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయారు. 1200 కుటుంబాలు నివాసం ఉండగా.. ఇప్పుడు 550 కుటుంబాలే ఉంటున్నట్లు టౌన్షిప్ సంక్షేమ సంఘం నిర్వాహకులు చెబుతున్నారు. యజమానులే ఉంటుండగా.. అద్దెకు ఉన్న వారందరూ దాదాపు ఖాళీ చేసిన పరిస్థితి. దీనికితోడు నిర్వహణ ఛార్జీల రూపేణా నెలకు రూ.కోటి వసూలయ్యేది. ఇప్పుడు బకాయిలు పేరుకుపోయాయి.
భాగ్యనగరం ఐటీకి ఆలవాలం.. ఐటీ కంపెనీల రాకతో ఎక్కడికక్కడ సమీప ప్రాంతాల రూపురేఖలే మారిపోతున్న పరిస్థితి. అపార్టుమెంట్లు, టౌన్‌షిప్‌ల రాకతో నివాస, వాణిజ్య కార్యకలాపాలు పెరిగి హైటెక్‌సిటీలోనే కాకుండా శివారుల్లోని నానక్‌రాంగూడ, పోచారం, ఘట్కేసర్, ఉప్పల్, ఆదిభట్ల ప్రాంతాల్లో కొత్త కళ సంతరించుకుంది. ఇప్పుడు పరిస్థితులు పూర్తి భిన్నం. కరోనా మహమ్మారి కారణంగా నగరంలో ఐటీ కంపెనీలు మూతపడటంతో టౌన్‌షిప్‌లు, అపార్టుమెంట్లు సందడి లేక బోసిపోయి కనిపిస్తున్నాయి. తర్వాత అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభమైనా ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తుండటంతో కంపెనీలు తెరుచుకోలేదు. వర్చ్యువల్ సమావేశాలు నిర్వహించుకుని విధులు నిర్వర్తిస్తున్నారు.