రాష్ట్రంలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. లక్షణాలు కనిపిస్తున్నా సకాలంలో నిర్ధారణ పరీక్షలు, చికిత్స పరంగా నిర్లక్ష్యం చేస్తున్న కొద్దీ, ఇతర వ్యాధులున్న బాధితుల పరిస్థితి తీవ్రమవుతోంది. వారిలో 30 శాతం మందికి ఆసుపత్రుల్లో వైద్యం అందించాల్సి వస్తోంది. ఆక్సిజన్‌పై చేరికలు గణనీయంగా పెరగడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో 18,506 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
దీర్ఘకాలిక సమస్యల వల్లే
తొలిదశ, రెండోదశకు ముందుగా ఆసుపత్రి చికిత్సలు తక్కువగానే ఉన్నా, వైరస్ వ్యాప్తి పెచ్చుమీరటంతో పరిస్థితి చేయిదాటుతోంది. ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నా కొందరికి ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉండటంతో పరిస్థితి తీవ్రమవుతోంది. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందులు తలెత్తడంతో ఆక్సిజన్ కోసం ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులెట్టాల్సి వస్తోంది. మరోవైపు ఆసుపత్రుల్లో చేరికలు పెరగడంతో కొన్ని ఆసుపత్రుల్లో ఆక్సిజన్, ఐసీయూ పడకలు నిండుకున్నాయి. ప్రైవేటులో మరిన్ని వైద్య కేంద్రాలకు అనుమతులిస్తూ పడకల స్థాయి పెంచుతున్నా ఆక్యుపెన్సీ రేటూ అదే మాదిరి ఉండటం ఆందోళన కలిగిస్తోంది.