భాగ్యనగరంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. శనివారం రాత్రి 8 గంటల సమయం వరకు గ్రేటర్ పరిధిలో 517 కొత్త పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. ఇదే సమయంలో రంగారెడ్డి జిల్లాలో 181, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 146 కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు.
అజాగ్రత్త వద్దు
ఏమాత్రం అజాగ్రత్త వహించకుండా.. తరచూ వేడి నీళ్లు తాగడం.. విటమిన్లు, మినరల్స్ ఉండే ఆహారం, కషాయాలు తీసుకోవడం, కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర.. వైద్యులు సూచించిన మందులు వాడుతూ.. తగిన వ్యాయామం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆరోగ్య పరిరక్షణ ఒక కార్యక్రమంగా చేపట్టినప్పుడే కరోనా నుంచి బయట పడగలమని చెబుతున్నారు. ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు.
‘కింగ్‌కోఠి’లో నలుగురు కొవిడ్ బాధితుల మృతి
కింగ్‌కోఠి జిల్లా ఆసుపత్రికి రోజూ వందల సంఖ్యలో కొవిడ్ అనుమానితులు వస్తుంటారు. వచ్చిన ప్రతి ఒక్కరికీ పరీక్షలు చేస్తున్నారు. నివేదిక వచ్చే వరకు ఆసుపత్రిలోనే ఉండాలి. పాజిటివ్ వచ్చిన తర్వాతే గాంధీ ఆసుపత్రికి తరలిస్తారు. గత రెండు రోజుల క్రితం మంచిర్యాల జిల్లా తాండూర్‌కు చెందిన 72 సంవత్సరాల వ్యక్తి, మహబూబ్‌నగర్ జిల్లా సిసి కుంటకు చెందిన 86 ఏళ్ల వృద్ధుడు, మంచిర్యాలకు చెందిన మరో 70 సంవత్సరాల వయోధికుడు, హైదరాబాద్ హుస్సేనీఆలంకు చెందిన 62 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గాంధీకి తరలించే లోపే పరిస్థితి విషమించి నలుగురు మృతి చెందారు.
ఇదీ చూడండి:రాష్ట్రంలో కొత్తగా 983 కరోనా కేసులు.. 11 మంది మృతి