రాష్ట్రంలో శుక్రవారం రికార్డు స్థాయిలో 4,446 పాజిటివ్ కేసులు నమోదు కాగా 12 మంది మరణించినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో దాదాపు 11 శాతం ఈ ఏప్రిల్ నెలలోనే వచ్చాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. శుక్రవారం నాటికి మొత్తం కేసులు 3,46,331గా ఉంటే.. ఇందులో దాదాపు 11 శాతం 37,555 కేసులు ఈనెల 1 నుంచి 16 వరకు నమోదైనవే. చికిత్స నుంచి 1,414 మంది కోలుకోవడంతో కోలుకున్నవారి సంఖ్య 3,11,008కి చేరింది. ప్రస్తుతం 33,514 మంది చికిత్సలో ఉన్నారు.
కరోనా విజృంభణ: ఈ నెలలోనే 11 శాతం కేసులు - తెలంగాణ వార్తలు
దేశంలో కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో శుక్రవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 4,446 మందికి వైరస్ సోకింది. మహమ్మారితో మరో 12మంది బలయ్యారు. రెండో దశ తీవ్రంగా ఉండడం వల్ల ఏప్రిల్‌లోనే దాదాపు 11 శాతం కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
గత నెలాఖరు నాటికి మరణాల సంఖ్య 1,701గా ఉంటే.. శుక్రవారానికి 1,809కి చేరింది. గత 16 రోజుల్లో 108 మంది చనిపోయారు. ఈ నెలలో రెండోదశ తీవ్రంగా ఉండటంతో వైద్య ఆరోగ్యశాఖ పరీక్షలు పెంచింది. ఈనెల 12న 1.13 లక్షల నమూనాలు పరిశీలిస్తే 3,052 కేసులు వచ్చాయి. శుక్రవారం 1.26 లక్షలు పరిశీలిస్తే 4,446 పాజిటివ్‌లు వచ్చాయి.
- కొత్తకేసులు 4,446
- మొత్తం కేసులు 3,46,331
- మరణాలు 1,809
జిల్లాల్లోనూ కేసుల వరద..
జిల్లాల్లోనూ కరోనా విశ్వరూపం చూపుతోంది. కొన్ని జిల్లాల్లో వందల సంఖ్యలో బాధితులుగా మారుతున్నారు. శుక్రవారం అత్యధికంగా హైదరాబాద్‌లో 598 కేసులు వచ్చాయి. ఆ తరువాత మేడ్చల్‌లో 435, రంగారెడ్డిలో 326, నిజామాబాద్‌లో 314, సంగారెడ్డిలో 235, ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనూ రెండువందలకు చేరువలో ఉన్నాయి. వారం రోజులుగా రోజురోజుకూ ఈ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కొన్ని జిల్లాల్లో కేసులు వారం రోజుల్లోనే రెట్టింపు అయ్యాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో 10,579, ప్రైవేటు ఆస్పత్రుల్లో 16,244 పడకలు ఖాళీగా ఉన్నాయి.
జిల్లాలో కేసులు ఇలా...
- ఇదీ చదవండి :కరోనాకు కళ్లెం వేసేందుకు కఠిన ఆంక్షలు