ఒకప్పుడు మద్యం తాగడం పెద్ద తప్పు.. ఇప్పుడదొక ఫ్యాషన్.. ఆ తర్వాత పరేషాన్ - hyderabad latest news
Drinking alcohol is harmful to health: ఒకప్పుడు మద్యం తాగడం పెద్ద తప్పు. కానీ ఇప్పుడదొక ఫ్యాషన్‌గా మారిపోయింది కొందరికి. కాలంతోపాటు మన అలవాట్లు మారిపోవచ్చు. కానీ మద్యపానంతో తలెత్తే అనర్థాలు మాత్రం ఎప్పుడూ ఒక్కలాగే ఉంటాయి. మద్యం హాని చేస్తుందని, ఆరోగ్యాన్ని కబళిస్తుందని తెలిసినా చాలామంది మత్తుకు దాసోహం అవుతున్నారు.
Etv Bharat
By
Published : Feb 12, 2023, 8:03 AM IST
Drinking alcohol is harmful to health: చిన్న వయసు నుంచే చాలామందికి మద్యపానం అలవాటుగా మారుతోంది. వేడుకలు, పార్టీల్లో సరదాగా మొదలై, ఆపై సామాజిక మర్యాదగా మారి, చివరికి వీడని వ్యసనంగా పరిణమిస్తోంది. మద్యం గుండెకు మేలు చేస్తుందని, వారానికి ఒకటి రెండుసార్లు మితంగా పుచ్చుకోవడం ఆరోగ్యానికి మంచిదని కొందరు నమ్ముతుంటారు. అయితే గుండెకు మేలు చేస్తుందో లేదో కానీ.. మద్యం ఎంత తక్కువ పరిమాణంలో తాగినా సరే, అది కాలేయానికి, క్లోమ గ్రంధికి, మెదడుకు హానికరంగా పరిణమిస్తుందన్నది కాదనలేని సత్యం.
అంతేకాదు.. ఎన్నో ప్రమాదాలకు ఇది ముఖ్య కారణమవుతోంది. మద్యం మితంగా తాగితే ఆరోగ్యానికి మంచిదనే ప్రచారాన్ని చాలామంది పాక్షికంగానే అర్థం చేసుకుంటున్నారు. కొందరు ఆల్కహాల్‌లో కొన్ని రకాలు మాత్రమే మంచివికావని నమ్ముతుంటారు. నిజానికి ఏ రకమైన మద్యమైనా సరే అది మన ఆరోగ్యాన్ని కబళిస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.
మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. మద్యపానం వేరు, మద్యానికి బానిస అవడం వేరు. బానిస అవడాన్ని సబ్‌స్టెన్స్ యూజ్ డిజార్డర్ కింద పరిగణిస్తారు. మద్యానికి బానిస కావడం, మద్యం తీసుకోకపోతే విత్ డ్రాయల్ సింప్టమ్స్ అంటే కాళ్లు, చేతులు వణకడం, ఉద్రేకం, కోపం రావడం, నిద్ర పట్టకపోవడం వంటి అనేక సమస్యలు ఉత్పన్నం అవుతాయి. మద్యానికి అలవాటు పడినవాళ్లు డ్రగ్స్‌కు కూడా తేలికగా అలవాటు పడుతుంటారు.
ఇలా అలవాటై, ఆపై వ్యసనంగా..
చదువులో మంచి ర్యాంకు వచ్చినా.. కొత్త జాబ్ వచ్చినా.. కొత్త బైక్ కొన్నా.. కొత్తగా కారు కొన్నా.. కొత్తింట్లోకి మారినా.. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చినా.. ఇలా ప్రతి చిన్న సందర్భానికీ పార్టీ చేసుకోవడం అన్నది ఇటీవలికాలంలో యువతకు పరిపాటిగా మారిపోయింది. సంతోషంలోనే కాదు, బాధను కూడా దీంతోనే మరచిపోగలమని కొందరు భావిస్తుంటారు. ఎక్కడో ఓ చోట, సంతోషంలో, సోషల్ డ్రింకు కింద ఆరంభమయ్యే ఆల్కహాల్, మెల్లమెల్లగా అలవాటుగా మారి, మన నరనరాల్లోకి చొచ్చుకుపోయి వదిలించుకోలేని వ్యసనంలా మారిపోతుంది. అక్కడి నుంచే ఆరోగ్యం దెబ్బతినడం మొదలవుతుంది. ఇక అనారోగ్యం గుప్పిట్లో చిక్కుకున్నట్టే.
నాడీ వ్యవస్థ కుదేలు
ఏ దురలవాటైనా దాని ప్రభావం మొదట శరీరంపై కనిపించి, తర్వాత మెదడు పనితీరును దెబ్బతీస్తుంది. మద్యపానం కూడా అంతే. ఆల్కహాల్ వల్ల ప్రత్యక్షంగా కంటిచూపులో, జ్ఞాపకశక్తిలో కొన్ని మార్పులు చోటుచేసుకుంటాయని వైద్య సర్వేలు చెబుతున్నాయి. మెదడులోని నాడీ వ్యవస్థను మద్యపానం ప్రభావితం చేస్తుంది. ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునేవారికి మాటపై నియంత్రణ తగ్గిపోతుంది.
నాడీ వ్యవస్థ క్రమంగా బలహీనపడుతుంది. నరాలు దెబ్బతినడం, కాళ్లు, చేతుల్లో స్పర్శ తగ్గడం, అరికాళ్లలో మంటలు, కండరాలు బలహీనం, పక్షవాతం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. ఇక సెరిబెల్లా డీజెనరేషన్ అంటే.. నడిస్తే తూలిపోవడం, సరిగా నడవలేకపోవడం, తెలివితేటలు మందగించడం, మతిమరుపు, సెరిబ్రల్ ఎట్రోఫీ ఇలా రకరకాల సమస్యలు కనిపిస్తుంటాయి.
మానసికంగానూ ముప్పేట దాడి
ఈ అలవాటుకు సామాజిక అనుమతి ఉండదు కాబట్టి వ్యక్తిత్వపరమైన లోపాలు వస్తాయి. ఇవన్నీ కలిసి ఆ వ్యక్తి తాలూకు ఆలోచనా సామర్థ్యాన్ని, వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తాయి. ఇవన్నీ అంతిమంగా మానసిక కుంగుబాటును తీసుకొచ్చే ప్రమాదం ఉంటుంది. కోపం, ఉన్మాదం ఛాయలు కనిపిస్తాయి. చిన్నచిన్న సమస్యలకే మానసికంగా కుంగిపోతుంటారు. ఒంటరితనాన్ని కోరుకుంటూ ఉంటారు.
సామాజిక బంధాల్ని, కుటుంబ సభ్యులతో అనుబంధాల్ని సరిగా ప్రదర్శించలేకపోతుంటారు. నేర ప్రవృత్తి పెరుగుతుంటుంది. స్క్రిజోఫ్రేనియా, బైపోలార్ డిజార్డర్ వంటి మానసిక రుగ్మతల ముప్పు ఎక్కువ అవుతుంది. విశృంఖలమైన లైంగిక ధోరణుల వల్ల హెచ్‌ఐవీ వంటి వ్యాధుల బారిన పడే ముప్పు కూడా ఉంటుంది.
వ్యసనానికి చికిత్స ఇలా..
మద్యపానం అనేది ఓవైపు మనల్ని మత్తులో ముంచుతూనే మెల్లమెల్లగా ఆరోగ్యాన్ని హరిస్తుంది. మనిషిని శారీరకంగా, మానసికంగా పీల్చి పిప్పి చేస్తుంది. ఆర్థికంగానూ, సామాజికంగానూ దెబ్బ కొడుతుంది. ఈ వ్యసనానికి బానిసగా మారక మునుపే కోలుకోవడం అన్ని విధాలా మేలు. వ్యసనంగా తయారైతే మాత్రం తగిన చికిత్స తీసుకోవాలి. ఈ వ్యసనాన్ని వదిలించుకునేందుకు నేడు అనేక రకాల మందులతోపాటు, కౌన్సెలింగ్, బిహేవియర్ థెరపీల వంటి చక్కటి పరిష్కారాలు అందుబాటులో ఉన్నాయి.
ముందుగా వైద్యులు అల్కహాల్ లేదా సబ్‌స్టెన్ యూజ్ డిజార్డర్ తీవ్రతను అంచనా వేస్తారు. మద్యపానం వ్యసనం తీవ్రతను బట్టి తొలిదశలో ఉందా తీవ్రస్థాయిలో ఉందా? మద్యంతో తలెత్తిన అనర్థాలు వ్యక్తిగతంగా, సామాజికంగా, కుటుంబపరంగా ఎలా ఉన్నాయి? ఇలా అనేక అంశాలను మదింపు చేసి ఒక అంచనాకు వస్తారు. మద్యపానం అలవాటు ఒక మోస్తరుగా ఉన్న వారికి సెల్ఫ్ హెల్ప్ గ్రూపు లేదా సోషల్ గ్రూప్స్ వల్ల మేలు జరుగుతుంది. మద్యంతో తలెత్తే పరిణామాలపై వారికి వివరించడం, అలవాటును మానుకున్న వారితో చర్చలు ఏర్పాటు చేయడం వల్ల వ్యసనం నుంచి సులువుగా బయటపడే అవకాశం లభిస్తుంది. అలవాటు మధ్యస్థంగా, తీవ్రంగా ఉన్నవారికి మందుల అవసరం ఉంటుంది. కనీసం ఆర్నెల్లు వాడాలి. మందులతోపాటు కౌన్సెలింగ్, బిహేవియర్ థెరపీల సాయం తీసుకోవాలి.
బానిసలుగా మారుస్తున్న కారణాలివే..
* చిన్న వయసు నుంచే అలవాటైనవారు త్వరగా బానిసలుగా మారుతుంటారు.
* కుటుంబంలో అనుబంధాలు బలహీనంగా ఉన్నపుడు, తండ్రి లేదా తల్లి ఎవరో ఒకరి దగ్గర మాత్రమే పెరుగుతున్నపుడు, కుటుంబంలో ఎవరో ఒకరికి ఈ అలవాటు ఉన్నపుడు పిల్లలు చాలా తేలికగా మద్యానికి ఆకర్షితులవుతారు.
* కొంతమందికి జన్యుపరంగా స్వాభావికంగానే దీనిపై అనురక్తి ఉంటుంది.
* పండుగలు, వేడుకలు, పెళ్లిళ్ల సమయంలో మద్యం తాగే అలవాటు ఉన్న కుటుంబాల్లోని పిల్లలు చాలా త్వరగా దీనికి అలవాటు పడే అవకాశం ఉంటుంది.
అన్నింటిలోనూ ఆల్కహాలే
మద్యం బ్రాండ్ ఏదైనా అన్నింట్లో ఉండేది ఆల్కహాలే. దాని శాతం మారుతుందంతే. వైన్‌లో పెద్దగా ఆల్కహాల్ ఉండదు, అది ద్రాక్షరసమే.. ఆరోగ్యానికి మంచిదని తమకు తాము సర్ది చెప్పుకొనే వారెందరో. రెండు పెగ్గులు గుండెకు మంచిది కాబట్టి తాగుతున్నాను అని చెప్పుకొనే వారు ఎందరో. అలాగే, కేవలం అప్పుడప్పుడు ఏదో ఫంక్షన్లోనో, ఫ్రెండ్సు కలిసినప్పుడో, పార్టీలోనో సోషల్‌గా తప్ప అస్సలు మందు ముట్టను అంటూనే ఆ ఉచ్చులో కూరుకుపోయే వారు ఉంటారు. ఇలా ఎన్ని సాకులు చెప్పినా ఒకసారి ఈ అలవాటు మొదలైందంటే ఓ పట్టాన వదలదు.
మద్యంతో ఒళ్లంతా గుల్లే..
'కాలేయానికి పెను ముప్పు :మద్యం శారీరక ఆరోగ్యాన్ని, మానసిక సమతుల్యతను దెబ్బతీస్తుంది. వ్యక్తిగతంగా, సామాజికంగా, ఆర్థికంగా దెబ్బకొడుతుంది. జీవితాన్ని, ఉద్యోగాన్ని, చదువుల్ని, కుటుంబ బంధాల్ని, లైంగిక ధోరణుల్ని మార్చేస్తుంది. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవటం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ పెరిగి, రక్తపోటు పెరుగుతుంది. అది గుండెను ప్రభావితం చేస్తుంది. శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి, గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. హార్మోన్ల పనితీరు మీద ప్రభావం చూపి, కొన్నిసార్లు మూత్రపిండాల వైఫల్యం సంభవించవచ్చు. మితిమీరి తాగడం, విపరీతంగా జంక్‌ఫుడ్ తినడం వల్ల పొట్ట ఆరోగ్యం దెబ్బతింటుంది. మద్యం ఎక్కువగా తాగేవారిలో కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది. దీన్నే ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటారు. ఇది ఏమాత్రం శ్రుతి మించినా మరెన్నో సమస్యలకు దారితీసి కాలేయం రాయిలా గట్టిపడిపోయే లివర్ సిరోసిస్‌కు దారితీస్తుంది. జీర్ణ సమస్యలు, పొట్టలో పుండ్లు, పేగు పూత, పెద్దపేగు కాన్సర్ల లాంటి సమస్యల తాకిడి కూడా ఎక్కువే. ఎంత మితంగా మద్యం పుచ్చుకున్నా సరే, ఆల్కహాలిక్ హెపటైటిస్, లివర్ సిరోసిస్, లివర్ క్యాన్సర్ వంటి సమస్యలు ఎదురవుతాయి. కాలేయంతోపాటు క్లోమ గ్రంధికి సమస్య పెరుగుతుంటుంది. క్లోమగ్రంధిలో వాపు మూలంగా ప్రాణాపాయ పరిస్థితులు ఎదురవుతుంటాయి.'- డాక్టర్ శంకర్ ప్రసాద్, సీనియర్ జనరల్ ఫిజీషియన్, కిమ్స్ - సన్‌షైన్ హాస్పిటల్, సికింద్రాబాద్