Consumer Commission: హైదరాబాద్ నగరానికి చెందిన హితేశ్ కుమార్ కేడియా స్పాంజ్ ఐరన్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. స్పాంజ్ ఐరన్ స్టాక్‌కి సంబంధించిన విషయంలో 2018లో న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌లో స్టాండర్డ్ ఫైర్ అండ్ స్పెషల్ పెరిల్ పాలసీ తీసుకున్నారు. అనూహ్యంగా అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు పరిహారం పొందేలా పాలసీ చేశారు. హితేశ్ కుమార్ గోదాములో సుమారు రూ. 2కోట్ల రూపాయల విలువైన స్పాంజ్ ఐరన్ స్టాక్‌కు నిల్వ చేసిన సమయంలో 2018 మే 10న అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటల కారణంగా సుమారు రూ.79 లక్షల రూపాయల విలువైన స్టాక్ దగ్ధమైంది.
బీమా క్లెయిన్ తిరస్కరణ...
Consumer Commission: అయితే ఈ ప్రమాద ఘటనకు సంబంధించి పరిహారం కోసం దరఖాస్తు చేసుకోగా... ఆ మొత్తం చెల్లించేందుకు బీమా కంపెనీ నిరాకరించింది. బీమా కంపెనీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హితేశ్... జిల్లా వినియోగదారుల కమిషన్-1ను ఆశ్రయించారు. ఫిర్యాదుపై రాతపూర్వక వివరణ అందించిన బీమా సంస్థ... ప్రమాదం అగ్ని ద్వారా సంభవించలేదని అందుకే బీమా క్లెయిమ్‌ను తిరస్కరించినట్లు సమర్థించుకుంది. ఇరు పక్షాల వాదనలు విన్న కమిషన్-1 అధ్యక్షురాలు పి.కస్తూరి, సభ్యుడు రామ్‌మోహన్‌తో కూడిన బెంచ్ బీమా కంపెనీ వైఖరిని తప్పు పట్టింది. సకాలంలో సేవలు అందివ్వడంలో విఫలం చెందారంటూ వ్యాఖ్యానిస్తూ తీర్పు వెలువరించింది.