dasoju sravan: రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం కోసం ప్రజల ఆస్తులు అమ్మడం సామాజిక నేరమని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. సర్కార్ రియల్ ఎస్టేట్ బ్రోకర్‌లా వ్యవహరిస్తోందని విమర్శించారు. హైదరాబాద్ గాంధీ భవన్‌లో ఆయన మాట్లాడారు .
ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం పేదల భూములు లాక్కోవడం దారుణమని దాసోజు శ్రవణ్ అన్నారు. ఆత్మ గౌరవం, ఆర్థిక భద్రత కోసం గత ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేదలకు భూములిచ్చినట్లు తెలిపారు. ఆ భూములను తెరాస ప్రభుత్వం రియల్ ఎస్టేట్ గద్దలా లాక్కుంటోందని ఆయన మండిపడ్డారు. తెరాస నాయకులు, సంపన్నుల భూములను ప్రభుత్వం ఇలానే లాక్కోగలదా అని దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు.
"తెరాస నాయకుల వద్ద ఉన్న అసైన్డ్ భూములు లాక్కొనే దమ్ము సీఎం కేసీఆర్‌కి ఉందా. తెలంగాణ సర్కార్ సందుకో బారు పెట్టి ఖజానా నింపుకుంటొంది. మరోవైపు పేదల భూములు లాక్కుంటోంది. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని చెప్పి ఇప్పటికీ ఇవ్వలేదు. భూమి ఇవ్వకపోగా ఉన్న భూములను కూడా గుంజుకోవాలని చూస్తుంది."