తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ - ఎన్నికల ప్రచారం

కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రచారానికి శ్రీకారం చుట్టింది. లోక్​సభ అభ్యర్థులు ఆయా నియోజకవర్గ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ.. ప్రచారం చేపట్టారు.

ఎన్నికల ప్రచారం

By

Published : Mar 23, 2019, 10:22 AM IST

Updated : Mar 23, 2019, 2:02 PM IST

ప్రచారానికి సమాయత్తమవుతున్న కాంగ్రెస్​
రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్‌ శ్రీకారం చుట్టింది. ఇప్పటికే అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అందులో సగం మందికి పైగా ప్రచారాన్ని ప్రారంభించారు. సమయం తక్కువగా ఉండటం వల్ల పలు ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారానికి, కార్యకర్తల సమావేశాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

ఈ నెల 25న నామినేషన్లకు గడువు ముగుస్తుండటంతో పలువురు కాంగ్రెస్‌ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. తొలి విడతగా ప్రకటించిన 8 మంది అభ్యర్థులు పార్టీలో వివిధ వర్గాల మద్దతు కూడగట్టుకునేందుకు సమావేశాలు నిర్వహించారు. ఈ జాబితాలో నలుగురు పాత అభ్యర్థులే కావడం వల్ల ఆయా నియోజకవర్గాల్లో పార్టీ నేతలతో సమన్వయం చేసుకుంటూ... ప్రచార ప్రణాళికలను రూపొందించుకుంటున్నారు. సీనియర్‌ నేతలు కొత్త అభ్యర్థులకు అండగా నిలుస్తూ ముందుకు వెళ్తున్నారు.

ప్రధానంగా కరీంనగర్‌, ఆదిలాబాద్‌, మహబూబాబాద్‌, చేవెళ్ల, జహీరాబాద్‌ సెగ్మెంట్‌ల బరిలో ఉన్న పొన్నం ప్రభాకర్‌, రమేశ్‌ రాఠోడ్‌‌, బలరాం నాయక్‌, కొండా విశ్వేశ్వర రెడ్డి, మదన్​ మోహన్‌ రావు గతంలో ఆ నియోజకవర్గాల్లో పోటీ చేసినవారే. మదన్‌ మెహన్‌ రావు మినహా నలుగురు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. కొత్త అభ్యర్థులుగా బరిలో దిగిన రేవంత్‌ రెడ్డి నియోజకవర్గంలో ముఖ్యనేతలను సమీకరించుకుంటున్నారు. మల్కాజిగిరి బరిలో దిగిన రేవంత్‌ కాంగ్రెస్‌ నేతలను సమన్వయం చేసుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.

తొలిసారిగా ఎన్నికల బరిలో నిలిచిన మెదక్‌ లోక్‌సభ అభ్యర్థి గాలి అనిల్‌ కుమార్‌ నియోజకవర్గం నాయకులతో కలిసి ప్రచారాన్ని ప్రారంభించారు. మాజీ మంత్రి చంద్రశేఖర్‌ పెద్దపల్లి నుంచి బరిలో దిగారు. కొత్తగా బరిలో ఉన్న ఆయన పూర్తిగా స్థానిక నేతలపై ఆధారపడ్డారు.

నల్లగొండ నుంచి బరిలో దిగిన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, భువనగిరి అభ్యర్థిగా మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ నేతలతో సమావేశమవుతూ ప్రచారంపై దృష్టిసారించారు. కీలక నేతలతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసుకుని ముందుకు సాగుతున్నారు. నాగర్​కర్నూలులో మల్లు రవి అభ్యర్థిగా ప్రటించడానికి ముందే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. స్థానిక నేతలను సమన్వయం చేసుకుంటూ ప్రచారం కొనసాగిస్తున్నారు.

ఉమ్మడి మహబూబ్​నగర్‌ జిల్లాలో మాజీ మంత్రి డీకే అరుణ కాంగ్రెస్​ను వీడి భాజపాలో చేరటం వల్ల ఆ లోక్​సభ పరిధిలోని పార్టీ శ్రేణులు దూరం కాకుండా నియోజకవర్గ హస్తం నాయకులు ప్రణాళికలు రచిస్తున్నారు. మాజీ ఎంపీలు మధుయాస్కీ, అంజన్​కుమార్‌ యాదవ్‌ నిజామాబాద్‌, సికింద్రాబాద్‌ నుంచి మరోమారు పోటీలో నిలిచారు. గత ఎన్నికల్లో ఇదే స్థానాల్లో పోటీ చేసిన వారు కావటం వల్ల పార్టీ శ్రేణుల్ని సమన్వయం చేసుకోవడంలో సమస్యలు ఎదురుకావటం లేదు.

వరంగల్‌ నుంచి పోటీ చేస్తున్న దొమ్మాటి సాంబయ్య లోక్‌సభ పరిధిలోని నేతలతో చర్చిస్తున్నారు. తొలిసారిగా కాంగ్రెస్‌ తరఫున బరిలో దిగుతున్నందున నియోజకవర్గ నేతలతో చర్చలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. హైదరాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి ఫిరోజ్‌ఖాన్‌ ప్రచారానికి సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థుల్లో తొమ్మిది మంది ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో పోటీచేసిన వారే కావడం వల్ల మూడు నెలల్లో మరోమారు ఎన్నికల బరిలో నిలిచారు.

ఇవీ చూడండి :ఫిరాయింపులపై అఖిలపక్ష సమావేశం

Last Updated : Mar 23, 2019, 2:02 PM IST

ABOUT THE AUTHOR

...view details