తెలంగాణ

telangana

ETV Bharat / state

'పార్టీ మారాల్సి వస్తే రాజీనామా చేస్తా... తెరాసను ఢీకొట్టే పార్టీయే నా ప్లాట్ ఫామ్' - assembly issue today

అసెంబ్లీలో తమ సభ్యులు మరింత గట్టిగా మాట్లాడి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. రికార్డుల నుంచి తన వ్యాఖ్యలు మాత్రమే తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ మారాల్సి వస్తే పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో అయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.

rajagopal
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

By

Published : Mar 15, 2022, 5:22 PM IST

Updated : Mar 15, 2022, 7:18 PM IST

అసెంబ్లీలో తమ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మరింత గట్టిగా మాట్లాడి ఉండాల్సిందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. సభలో నిన్న జరిగిన దానికి చాలా బాధపడ్డానని తెలిపారు. తమ సభ్యులు తనకు అండగా నిలిచి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదన్నారు. పార్టీ మారాల్సి వస్తే పదవికి రాజీనామా చేస్తానని రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు. అసెంబ్లీ ప్రాంగణంలో అయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.

కేవలం నా మాటలే తొలగించారు

నాయకులంతా కలిసికట్టుగా పనిచేస్తే అధికారంలోకి వస్తామని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ బలంగా ఉందని...గ్రామాల్లోనూ కార్యకర్తలు కూడా బలంగానే ఉన్నారని స్పష్టం చేశారు. సభలో వారు మాట్లాడింది అట్లే ఉంచి.. కేవలం తన మాటలనే రికార్డుల నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. భట్టి విక్రమార్క విషయంలో ప్రతీ అంశంలో తాము అండగా ఉన్నా.. ఆయన మాత్రం తమను వదిలేశారని ఆరోపించారు.

జీవన్​ రెడ్డిది నా స్థాయి కాదు

తన విషయంలో తెరాస ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడితే తాను స్పందించాల్సిన అవసరం లేదని రాజగోపాల్ రెడ్డి అన్నారు. జీవన్ రెడ్డి తన స్థాయికి సరిపోడని తెలిపారు. ఇప్పటిదాకా తాను ఏ పార్టీ మారలేదని.. ఒకవేళ బయటికి వెళ్లాల్సి వస్తే బరాబర్​ పదవులకు రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. ఇప్పుడు అధిష్ఠానం తీసుకుంటున్న నిర్ణయాల వల్లే సైలెంట్​గా ఉంటున్నట్లు పేర్కొన్నారు. తెరాసను ఢీకొట్టే పార్టీయే తన ప్లాట్ ఫామ్ అవుతుందన్నారు. జనం కూడా కేసీఆర్​కు వ్యతిరేకంగా ఓటేయాలని ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ ఆ బాధ్యత గట్టిగా తీసుకుంటే తాను పది మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తానని రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు.

అందుకే సభకు రాలేదు

నిన్న అసెంబ్లీలో తలసాని వ్యాఖ్యల విషయంలో కాంగ్రెస్ సభ్యులెవరు తనకు మద్దతుగా మాట్లాడలేదని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. అందువల్లనే ఉదయం నుంచి సభకు రాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. సభ వాయిదా అనంతరం సీఏల్పీలో భట్టి ముందు నిరసన తెలిపారు. ఈ రోజు చేసిన ఖండన నిన్న చేస్తే బాగుండేదని రాజగోపాల్ రెడ్డి సూచించారు. తాను బలహీన వర్గాలకు చెందిన నేత కదా.. అందుకే ఆలస్యంగా స్పందించానని భట్టి పేర్కొనగా.. ఆ వాఖ్యలను ఉపసంహరించుకోవాలని రాజగోపాల్ రెడ్డి కోరారు.

'తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉంది. గ్రామాల్లో ఇప్పటికీ క్యాడర్ బలంగా ఉంది. లీడర్లు అందరూ కలిసి కట్టుగా పని చేస్తే అధికారంలోకి వస్తాం. పాదయాత్రలు ఎవరి నియోజకవర్గంలో వాళ్లు చేసుకుంటే చాలు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసినా నేను స్వాగతిస్తా. కేసీఆర్​కు వ్యతిరేకంగా ఎవరు పని చేసినా నేను మద్దతు ఇస్తా.' - కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే

ఇదీ చూడండి:

Last Updated : Mar 15, 2022, 7:18 PM IST

ABOUT THE AUTHOR

...view details