Telangana Congress MLA Candidates List :రాష్ట్రంలో ఎన్నికల వేడి మరింత పెరిగింది. ఇంతకాలం సభలు, సమావేశాలకు పరిమితమైన రాజకీయ పార్టీలు అభ్యర్థుల ప్రకటనపై కసరత్తును పెంచుతున్నాయి. అధికార బీఆర్ఎస్ ఒకడుగు ముందుకేసి.. ఒకేసారి 115 స్థానాలకు అభ్యర్థులను(BRS Candidates List 2023) ప్రకటించడంతో కాంగ్రెస్ సైతం గెలుపు గుర్రాల ఎంపికపై కసరత్తును మరింత వేగవంతం చేయాలని భావిస్తోంది.
Congress Focus On MLA Candidates First List 2023 : ఇప్పటికే అశావహుల నుంచి దరఖాస్తులుతీసుకుంటున్నరాష్ట్ర కాంగ్రెస్ ఈనెల 25వ తేదీ వరకు అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని పూర్తి చేయనుంది. అనంతరం దరఖాస్తులను పరిశీలన చేసి అర్హులైన వారితో నియోజకవర్గాల వారీగా.. అధికార పార్టీ అభ్యర్థులను ధీటుగా ఎదుర్కొనే గెలుపు గుర్రాల జాబితాను కేరళకు చెందిన కరుణాకరణ్ నేతృత్వంలో ఏర్పాటైన స్క్రీనింగ్ కమిటీకి నివేదిస్తుంది.
ఆ కమిటీ చర్చించి మెరుగైన నాయకులతో కూడిన జాబితాను.. కేంద్ర ఎన్నికల కమిటీకి పంపుతుంది. అందులో ఏమైనా సమస్యలున్నప్పుడు సీడబ్ల్యూసీ దృష్టికి తీసుకెళతారు. అధిష్ఠానం నిర్ణయం మేరకు అభ్యర్థులను ప్రకటిస్తారు. ఆ ప్రక్రియకు రెండు నుంచి మూడువారాలు పడుతుందనికాంగ్రెస్ అంచనా వేస్తోంది. కసరత్తును మరింత వేగవంతం చేసి వచ్చే నెల మొదటి వారంలో తొలి జాబితానైనా ప్రకటన చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ భావిస్తోంది.
BRS MLA Candidates List Telangana 2023 : బీఆర్ఎస్ ఏడుగురిని మినహా సిట్టింగ్‌లనే అభ్యర్ధులుగా ప్రకటించడంతో ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతను కాంగ్రెస్ సద్వినియోగం చేసుకోవాలని యోచిస్తోంది. గత పదేళ్లలో బీఆర్ఎస్ నాయకుల పనితీరుతో ప్రజలు పడిన ఇబ్బందులను ఇంటింటికి తీసుకెళ్లే దిశలో పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. నియోజకవర్గాల వారీగా సమాచారాన్ని క్రోడీకరించి.. వ్యతిరేకతను జనంలోకి తీసుకెళ్లడానికి అవసరమైన వ్యూహంతో ముందుకు వెళ్లతామని కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.