నల్గొండ జిల్లా పర్యటనకు రావద్దని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పడాన్ని కాంగ్రెస్ నేతలు తప్పుబట్టారు. పీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఎక్కడైనా పర్యటించొచ్చని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
అంతా బాగానే ఉంది.. అందరం కలిసే ఉన్నామని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నితిన్ గడ్కరీ ప్రోగ్రాంకు కోమటిరెడ్డి హాజరయ్యారు. తాము పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు స్థానిక నేతలకు సమాచారం ఇచ్చేవాళ్లమని తెలిపారు. రాహుల్ గాంధీ మీటింగ్‌కి ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి రికార్డు స్థాయిలో కార్యకర్తలు తరలి వస్తారని తెలియజేశారు.
"కాంగ్రెస్ నాయకులు ఎవ్వరూ ఏమీ మాట్లాడినా ఇంఛార్జ్ మాణికం ఠాగూర్ నోటిసుకి పోతాయి. అన్ని విషయాలని వారు పరిశీలిస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు రాష్ట్రంలో ఎక్కడైనా పర్యటించవచ్చు. ఎవ్వరూ ఎక్కడికి రాకూడదు అనే పరిస్థితి రావొద్దనేదే మా ఆలోచన." -మహేశ్ కుమార్ గౌడ్, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు