Congress Disputes: సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు వస్తున్న యశ్వంత్ సిన్హాను కలిస్తే తప్పుడు సంకేతాలు వస్తాయని కలవకూడదని కాంగ్రెస్ పీసీసీ నిర్ణయించింది. అయితే అందుకు భిన్నంగా పార్టీ సీనియర్ నేత వీహెచ్ బేగంపేటలో సీఎం కేసీఆర్‌తో కలిసి యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలికారు. రాహుల్ , సోనియా మద్దతు ప్రకటించినందునే సిన్హాను కలిశానని వ్యాఖ్యానించారు. యశ్వంత్ సిన్హాను సీఎల్పీ పక్షాన ఆహ్వానించి మద్దతు పలికి ఉండాల్సిందని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ నిర్ణయాన్ని జవదాటి కొందరు నేతలు వ్యవహరిస్తుండటం పార్టీకి తలనొప్పిగా మారింది.
మరో వైపు యశ్వంత్ సిన్హాను సీఎల్పీ పక్షాన భట్టి విక్రమార్క ఆహ్వానించి మద్దతు పలికి ఉండాల్సిందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. భట్టి విక్రమార్క ఎందుకు మిన్నకుండి పోయారని ప్రశ్నించారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిని ఆహ్వానించి మద్దతు ప్రకటించకపోవడం ఏమిటని నిలదీశారు. సీఎల్పీ నేత భట్టిపై అధిష్టానానికి లేఖ రాస్తానని జగ్గారెడ్డి వెల్లడించారు.
తెరాసతో కలిసి యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలికి మద్దతు ప్రకటిస్తే భాజపా నుంచి విమర్శలు వచ్చే అవకాశం ఉందని పీసీసీ భావించి కలవకూడదని నిర్ణయించింది. తెరాసతో కలిసి యశ్వంత్ సిన్హాను కలిస్తే కాంగ్రెస్, తెరాసలు ఒకటే అన్న విమర్శలు వస్తాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే పీసీసీ అధ్యక్షుడు నిర్ణయానికి పార్టీ నాయకులంతా కట్టుబడి ఉండాల్సి ఉంది. కానీ అందుకు భిన్నంగా పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు బేగంపేట ఎయిర్ పోర్ట్లో సీఎం కేసీఆర్‌తో కలిసి యశ్వంత్ సిన్హాను కలిసి స్వాగతం పలికారు.