తెరాస ప్రభుత్వానికి బుద్ది చెప్పడానికే దళిత గిరిజన ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్నామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇంద్రవెళ్లి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ఉద్యమం ప్రారంభమవుతుందని తెలిపారు. గాంధీభవన్‌లో పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కీ, ఎమ్మెల్యే సీతక్కతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ మాయమాటలు చెప్పి దళిత గిరిజనుల ఓట్లు దండుకుంటున్నారని భట్టి ఆరోపించారు. ఇప్పుడు దళితబంధు పేరుతో మరో మోసానికి తెరలేపాడని విమర్శించారు. ఉపఎన్నిక జరిగే హుజూరాబాద్‌కే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా దళితబంధును అమలుచేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.
ఎన్నికల ఉంటేనే ఆయనకు గుర్తుకొస్తారు
హుజురాబాద్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టే కేసీఆర్‌కు దళితులు గుర్తు కు వచ్చారని ఎద్దేవా చేశారు. దళితుడే ముఖ్యమంత్రి అయ్యుంటే రాష్ట్రంలో దళితులపై ఇన్ని దాడులు జరిగేవా అని మధుయాస్కీ అన్నారు. గిరిజనులపై జరుగుతున్న దాడులపై గిరిజన ప్రజా ప్రతినిధులు ఎందుకు నోరు విప్పడంలేదని అయన నిలదీశారు. అన్ని వర్గాలకు న్యాయం చేయగల ఏకైక పార్టీ కాంగ్రెస్సేనని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం గిరిజనుల నుంచి లాక్కోవడం తప్ప ఇచ్చిందేమిలేదని ఎమ్మెల్యే సీతక్క అగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనుల మధ్య చిచ్చు పెట్టి లబ్దిపొందేందుకు టీఆర్‌ఎస్ ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గిరిజనుల సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ఇంద్రవెళ్లి సభను ప్రతి గిరిజన బిడ్డ విజయవంతం చేయాలని సీతక్క కోరారు.
ఇదీ చూడండి: