కేసీఆర్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రా.. లేక ఉపఎన్నిక జరగబోయే నియోజకవర్గానికేనా అని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. ముఖ్యమంత్రి సమీక్షలు ఉపఎన్నిక జరగబోయే నియోజకవర్గానికే పరిమితమైతే ఎలా అని నిలదీశారు. నాగార్జునసాగర్ అభివృద్ధిపై మంత్రి మండలిలో చర్చించిన తర్వాత.. మళ్లీ హాలియాలో ముఖ్యమంత్రి సమీక్ష దేనికని.. ప్రచార ఆర్భాటం అనకపోతే ఏమంటారో చెప్పాలన్నారు. 2014, 2018 ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై సమీక్షలు ఎందుకు లేవో సీఎం సమాధానం చెప్పాలని పొన్నాల డిమాండ్ చేశారు. హుజూరాబాద్ ఉపఎన్నిక ఉందనే సాగర్‌లో సీఎం పర్యటించారని ఎద్దేవా చేశారు. దళిత బంధును నియోజకవర్గానికి 100 కుటుంబాల చొప్పున అందిస్తే... పథకం పూర్తిగా అమలయ్యేందుకు ఎన్నేళ్లు పడుతుందని పొన్నాల ప్రశ్నించారు.
పోడు భూముల సమస్య కొన్ని ఏళ్ల నుంచి ఉన్నా పట్టించుకోకుండా.. 15రోజుల్లో సమస్య పరిష్కరిస్తా అనడం ప్రచార ఆర్బాటం కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చిన తర్వాత నాగార్జున సాగర్ ఎడమ కాలువ నీరు ఎప్పుడు విడుదల చేస్తారో కేసీఆర్కు తెలుసా అని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో జూన్, జులై నెలల్లో సాగర్ ఎడమ కాలువకు నీరు విడుదల చేస్తే.. ఈ ప్రభుత్వం ఆగస్టులో నీరు విడుదల చేసిందని ఎద్దేవా చేశారు. విద్యుత్ ఉత్పత్తి చేయడం వల్ల సాగర్ నుంచి 45 టీఏంసీల నీరు సముద్రం పాలైందని ఆందోళన వ్యక్తం చేశారు. మరోసారి ఎన్నికల్లో మోసం చేయడానికే సీఎం కేసీఆర్ దళితబంధు తెస్తున్నారని ఆయన ఆరోపించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తే దళితులు, గిరిజనులు స్వశక్తితో ఎదిగేవారు కాదా అని నిలదీశారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు సక్రమంగా ఖర్చు పెట్టి ఉంటే దళితులు ఆర్థికంగా వృద్ధి చెందే వారు కాదా అని పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు.