మాజీ మంత్రి ఈటల రాజేందర్ భాజపాలో చేరడం అంటే.. ఒక గొంగళి పురుగును వదిలి మరొక గొంగళి పురుగును కౌగిలించుకోవడమేనని కాంగ్రెస్ సీనియర్ నేత నిరంజన్ ఆరోపించారు. బర్తరఫ్ అయ్యే వరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కొనియాడిన ఆయన... ఇవాళ భాజపా గూటికి చేరారన్నారు. రేపటి నుంచి ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టి భాజపాను, మోదీని పొగుడుతూ తిరుగుతారని విమర్శించారు. అసలు ఈటలకు ఆత్మ అనేది ఉంటే కదా ఆత్మగౌరవం ఉండటానికి అని ఆయన ఎద్దేవా చేశారు.
'ఈటల భాజపాలో చేరడం.. మరొక గొంగళిపురుగును కౌగిలించుకోవడమే'
భాజపా, తెరాసలపై ప్రజలు పెట్టుకున్న ఆశలు వమ్ము అయ్యాయని కాంగ్రెస్ సీనియర్ నేత నిరంజన్ అన్నారు. ఈటల రాజేందర్ భాజపాలో చేరడం అంటే మరొక గొంగళి పురుగును కౌగిలించుకోవడమేనని ఆరోపించారు.
హైదరాబాద్, హుజూరాబాద్‌లో మాట్లాడిన ప్రతిసారి ఆత్మగౌరవం గురించి ఏకరువు పెట్టిన ఈటల... ఇవాళ దిల్లీలో భాజపాలో చేరిన సమయంలో ఆ ఊసే ఎత్తలేదని ఆరోపించారు. అంతేకాకుండా తెలంగాణ, దక్షిణ భారతదేశంలో భాజపా నిర్మాణానికి కృషి చేస్తానని పేర్కొనడం ఆయన ఆత్మగౌరవ నినాదంలోని డొల్లతనాన్ని బట్టబయలు చేసిందని విమర్శించారు. భాజపా, తెరాసలపై ప్రజలు పెట్టుకున్న ఆశలు వమ్ము అయ్యాయని... ఇది ఈటల నిరాశ, నిస్పృహ, నిస్సహాయతలను ప్రతిబింబించేట్లు ఉందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: etela rajender: భాజపా తీర్థం పుచ్చుకున్న ఈటల రాజేందర్