Congress Focus on Poll Management in Telangana : పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ అగ్ర నాయకులు రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 30కి పైగా నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన రేవంత్ రెడ్డి.. ఇవాళ మరో 5 నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. నిజామాబాద్ రూరల్, నారాయణఖేడ్, గజ్వేల్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో రేవంత్ ప్రచారం నిర్వహించనున్నారు. మరో మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 20 నియోజకవర్గాల్లో ప్రచారం చెయ్యాలని పీసీసీ కార్యాచరణ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రమంతటా కాంగ్రెస్ గాలి - 75 నుంచి 78 స్థానాలతో ప్రభుత్వ ఏర్పాటు పక్కా : భట్టి విక్రమార్క
Congress Top Leaders Campaign in Telangana : మరోవైపు నిన్న (మంగళవారం) సాయంత్రం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్న ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు హెలికాప్టర్లో అలంపూర్ చేరుకుంటారు. అక్కడ సభలో పాల్గొని.. సాయంత్రం 4 గంటలకు నల్గొండ ఎన్నికల ప్రచార సభకు హాజరవుతారు. అక్కడి నుంచి నేరుగా బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని దిల్లీ వెళతారు.
Telangana Assembly Elections 2023 : ఎన్నికలు దగ్గర పడడంతో కాంగ్రెస్ అధిష్ఠానంపూర్తిస్థాయిలో తెలంగాణపై దృష్టి సారించింది. అందులో భాగంగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నిన్న రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఖర్గేతో కలిసి స్థానిక నాయకులతో సమావేశమై.. తాజా రాజకీయ పరిస్థితులపై సమీక్షించారు. అనంతరం సికింద్రాబాద్, మేడ్చల్ మల్కా జిగిరి, చేవెళ్ల పార్లమెంట్ స్థానాల పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాల స్థితిగతులపై.. గాంధీభవన్‌లో పలువురు ముఖ్య నేతలతో చర్చించారు. బీజేపీ గెలవకపోయినా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించిన కాంగ్రెస్.. ఆ ప్రభావాన్ని ఎలా తగ్గించాలన్న దానిపై సమాలోచనలు చేసినట్లు సమాచారం.