2014 శాసనసభ ఎన్నికల అనంతరం తెలంగాణలో పార్టీ సారథ్యం చేపట్టిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లోక్‌సభ ఎన్నికల అనంతరమే పీసీసీ పీఠాన్ని వదులుకుంటానని ప్రకటించారు. నాటి నుంచి అధ్యక్షుని మార్పుపై ఊహాగానాలు సాగుతున్నా.. అధిష్ఠానం నుంచి ఎలాంటి సంకేతాలూ వెలువడలేదు. ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షులను మార్చుతున్న క్రమంలో తెలంగాణ విషయం కూడా చర్చల్లోకి వస్తోంది. ఎన్నికలకు మరో నాలుగేళ్ల గడువు ఉంది. ఇప్పటి నుంచే పార్టీని బలోపేతం చేయాలంటే అధ్యక్షుల నియామకం అవసరమనే అభిప్రాయాన్ని పలువురు నేతలు పార్టీ పెద్దలకు వివరించినట్లు తెలిసింది.
ఆచితూచి వ్యవహరిస్తోన్న అధిష్ఠానం..
కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. పరిశీలకులను నియమించి రాష్ట్ర నేతల అభిప్రాయాలను తీసుకుని సాధ్యమైనంత వరకూ ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తుందని పార్టీ ముఖ్యనేతలు భావిస్తున్నారు. అధ్యక్ష రేసులో ప్రస్తుతం ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్‌రెడ్డి, సీనియర్ నేతలు మర్రి శశిధర్‌రెడ్డి, చిన్నారెడ్డి, శ్రీధర్‌బాబు, జీవన్‌రెడ్డిలతో పాటు జగ్గారెడ్డి పేర్లు పార్టీ వర్గాల మధ్య చర్చల్లో ఉన్నాయి.