showcause notice to eleti maheshwar reddy: ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డికి కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ షోకాజు నోటీసు జారీ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు క్షేత్రస్థాయి పార్టీ వర్గాల నుంచి అందిన ఫిర్యాదు ఆధారంగా షోకాజు నోటీసులిచ్చినట్లు క్రమ శిక్షణ కమిటీ ఛైర్మన్ చిన్నారెడ్డి స్పష్టం చేశారు. బీజేపీ పార్టీకి సన్నిహితంగా ఉంటున్నట్లు షోకాజు నోటీసులో తెలిపారు. తానిస్తున్న నోటీసుకు గంట లోపల సమాధానం ఇవ్వాలని చిన్నారెడ్డి సూచించారు. నిర్ధేశించిన సమయం లోపల షోకాజు నోటీసుకు సమాధానం ఇవ్వనట్లయితే పార్టీ మార్గదర్శకాల ప్రకారంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నోటీసుపై మహేశ్వర్ ఫైర్: తనకు షోకాజ్ నోటీసు ఎందుకు ఇచ్చారో తెలియదని, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ అయిన తనకు షోకాజ్ నోటీసు ఇచ్చే అర్హత పీసీసీకి లేదని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పీసీసీ జారీ చేసిన షోకాజ్ నోటీసుపై స్పందించారు. 13 ఏళ్లుగా కార్యకర్తగా పనిచేసిన షోకాజ్ నోటీసు ఎందుకు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏమైనా నాపై అవినీతి ఆరోపణలు ఉన్నాయా...? సామాజిక మాధ్యమాల్లో ఏదో వచ్చిందని నాకు షోకాజ్ నోటీసు ఇవ్వడం ఏంటి...? మచ్చలేని తన పట్ల ఈ తరహా చర్యలకు పాల్పడటం తప్పు అని ఆక్షేపించారు.'
ఖర్గేను కలిసిన తర్వాతే తదుపరి నిర్ణయం: గతంలో ఎన్నో అవకాశాలు వచ్చినా పార్టీ మారలేదని, తాజాగా షోకాజ్ నోటీసు ఇవ్వడం చాలా బాధగా ఉందని మహేశ్వర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. షోకాజ్ నోటీసు నేపథ్యంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలుస్తా... ఈ అంశం తన వద్దే తేల్చుకుంటానని స్పష్టం చేశారు. ఖర్గేని కలిసిన తర్వాత తన తదుపరి నిర్ణయం వెల్లడిస్తానని ప్రకటించారు. పార్టీలో నుంచి పంపేందుకు పొమ్మనకుండా పొగబెడుతున్నారని.. రేవంత్‌రెడ్డికి తెలియకుండా నోటీసు వచ్చిందా? సమాధానం చెప్పాలని కోరారు. షోకాజ్ నోటీసుపై తాను ఎందుకు వివరణ ఇవ్వాలి? అసలు నాకు నోటీసు ఇచ్చే అర్హత పీసీసీకి లేదని తెలిపారు. ఇప్పటికీ రేవంత్ రెడ్డి అంటే నాకు ఇష్టం అని... పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ఎప్పుడూ విమర్శించలేదని గుర్తు చేశారు. తాను పార్టీ మారాలని ఎప్పుడూ అనుకోలేదని.. నిర్మల్ సమావేశంలో పాదయాత్ర చేపట్టాలని నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. మహేశ్వర్ రెడ్డి ప్రజల మనిషి కాబట్టి ఇరుపార్టీలు తమ పార్టీలోకి వస్తే బాగుంటుందని అనుకుంటారని ఆయన పేర్కొన్నారు.
"కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేశాను తప్ప ఏరోజు నేను నాయకుడిగా పనిచేయలేదు. అలాంటి నాకు సోషల్ మీడియాలో ఏదో ఊహాగానాలు వచ్చాయని చెప్పి.. షోకాజు నోటీసులు దేనికోసం ఇచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను. నేను కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలకి నాకిచ్చిన బహుమానం ఇదా. ఈ అంశంపై ఖర్గేను కలిసి అక్కడే తేల్చుకుంటాను."_ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్
నాకు నోటీసు ఇచ్చే అర్హత పీసీసీకి లేదు?.. ఆయన వద్దే తేల్చుకుంటా ఇవీ చదవండి: