ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధుల అవినీతిపై నిరంతరం రాజీ లేని పోరాటం చేయాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిర్ణయించింది. పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి అధ్యక్షతన శనివారం రాత్రి పీసీసీ రాజకీయ వ్యవహారాల ముఖ్య నాయకుల సమావేశం జూమ్ యాప్ ద్వారా జరిగింది. సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, ఏఐసీసీ ఇన్‌ఛార్జి కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాసన్ కృష్ణన్, కార్యనిర్వాహక అధ్యక్షులు గీతారెడ్డి, జగ్గారెడ్డి, మహేష్‌కుమార్‌గౌడ్, ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కీ గౌడ్, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ తెలంగాణ ఛైర్మన్ మహేశ్వర్‌రెడ్డి, ప్రచార కమిటీ కన్వీనర్ అజ్మతుల్లా హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 18న చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని రావిర్యాలలో నిర్వహించనున్న దళిత, గిరిజన ఆత్మ గౌరవ దండోరా సభను విజయవంతం చేయాలని తీర్మానించారు. శాసనసభ్యుల రాజకీయ ఫిరాయింపులపై కేంద్ర స్థాయిలో ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. సెప్టెంబరు మొదటి వారంలో వరంగల్‌లో నిర్వహించతలపెట్టిన దండోరా సభకు రాహుల్‌గాంధీని ఆహ్వానించడానికి వెళ్లిన సమయంలోనే కోకాపేట భూ కుంభకోణంపై పార్టీ ఎంపీలు, మాజీ ఎంపీలతో సంతకాలు చేయించి కేంద్ర హోంశాఖకు, సీబీఐ డైరెక్టర్‌కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేయాలని తీర్మానించారు. ఏదైనా సమస్యపై పరిష్కారమయ్యేంత వరకు పోరాటం చేయాలని, మధ్యలో ఆపేస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని కొందరు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
ఎంపీ కోమటిరెడ్డి అంశంపై చర్చ