తెలంగాణ

telangana

ETV Bharat / state

REVANTH REDDY:నిజాంల పైజామ్‌లు ఊడగొట్టిన చరిత్ర ఈ గడ్డది: రేవంత్​ - revanth reddy latest news

త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్​.. అధికారం కోసం అమరవీరులనే అవమానించారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(revanth reddy) ఆరోపించారు. కాంగ్రెస్ తలపెట్టిన విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్​కు అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతలకు దారితీసింది. నేతలను గృహనిర్బంధం(house arrest) చేసిన పోలీసులు.. ఎల్బీనగర్, దిల్​సుఖ్​నగర్​లో కాంగ్రెస్ శ్రేణులను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. అరెస్టులపై మండిపడ్డ రేవంత్.. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు.

REVANTH REDDY:నిజాంల పైజామ్‌లు ఊడగొట్టిన చరిత్ర ఈ గడ్డది: రేవంత్​
REVANTH REDDY:నిజాంల పైజామ్‌లు ఊడగొట్టిన చరిత్ర ఈ గడ్డది: రేవంత్​

By

Published : Oct 2, 2021, 10:42 PM IST

నిజాంల పైజామ్‌లు ఊడగొట్టిన చరిత్ర ఈ గడ్డది: రేవంత్​

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ నూతన కార్యవర్గం ఏర్పాటైన తరువాత చేపట్టిన దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలు విజయవంతం కావడంతో విద్యార్థులు, నిరుద్యోగ యువత సమస్యలపై పోరాటానికి శ్రీకారం చుట్టింది. గాంధీజయంతి రోజున మొదలు పెట్టి డిసెంబరు 9వ తేదీన తెలంగాణ రాష్ట్రం సాకారమైన రోజు, సోనియాగాంధీ పుట్టిన రోజున ముగించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ ఇవ్వాలని పీసీసీ చేపట్టిన విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్(concern over student and unemployment) ఉద్రిక్తతలకు దారితీసింది. హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్ నుంచి ఎల్బీనగర్ వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ తెలంగాణ మలిదశ అమరవీరుడు శ్రీకాంతాచారికి విగ్రహానికి నివాళులు అర్పించాలని నిర్ణయించింది. అయితే ఈ కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. జూబ్లీహిల్స్​లోని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(revanth reddy) నివాసం వద్ద పోలీసులను భారీగా మోహరించి గృహనిర్బంధం చేశారు. ఎమ్మెల్యే క్వార్టర్స్​లో సీతక్కను అదుపులోకి తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డిని గృహనిర్బంధం చేశారు. ఇంటి నుంచి వెళ్లనివ్వకపోవటంపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలు, నేతలతో కలిసి ఇంటి ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రేవంత్, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో పోలీసులపై రేవంత్​ మండిపడ్డారు.

ఎంపీని అడ్డుకుంటారా..?

"నా నియోజకవర్గంలో తిరగకుండా చేస్తారా?. నా నియోజకర్గంలో పర్యటించేందుకు ఎవరి అనుమతి అవసరం లేదు. గాంధీ జయంతి కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. గాంధీ జయంతి రోజున ఒక ఎంపీ కార్యక్రమాలను అడ్డుకుంటారా? నా గృహనిర్బంధంపై ఉత్తర్వులు ఉంటే చూపాలి. శ్రీకాంత్‌చారికి నివాళి అర్పించే స్వేచ్ఛ కూడా లేదా?. శ్రీకాంత్‌చారికి నివాళి అర్పించాలంటే కేసీఆర్‌, కేటీఆర్‌ అనుమతి కావాలా?. నివాళి అర్పించేందుకు వెళ్తానంటే పోలీసులే భద్రత కల్పించాలి. శ్రీకాంత్‌చారి విగ్రహానికి దండం పెడితే కేసీఆర్‌, కేటీఆర్‌కు కోపం ఎందుకు?. కేసీఆర్‌ తప్ప.. శ్రీకాంత్‌చారి విగ్రహం వద్దకు ఎవరూ వెళ్లకూడదా?." - రేవంత్​రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

కార్యకర్త ఆత్మహత్యాయత్నం

దిలీసుఖ్​నగర్ రాజీవ్ చౌక్ వద్ద ర్యాలీ తీయకుండా కాంగ్రెస్‌ శ్రేణులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. మెట్రో స్టేషన్​ను అధికారులు మూసివేశారు. ర్యాలీ(congress rally) కోసం వచ్చిన వాళ్లను అదుపులోకి తీసుకున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా దుకాణాలు మూసివేయించారు. ఎల్​బీనగర్ కూడలిలో పెట్రోల్ పోసుకునేందుకు యత్నించిన కాంగ్రెస్ కార్యకర్తను పోలీసులు అడ్డుకున్నారు. చివరకు పోలీసులను దాటుకొని.. ఎల్బీనగర్​లో శ్రీకాంతాచారి విగ్రహం వద్దకు కాంగ్రెస్ నాయకులు చేరుకుని పూలమాలలు వేశారు. శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాల వేసి సంపత్ , మహేశ్వర్ రెడ్డి నివాళులు అర్పించారు.

తెలంగాణను బంధవిముక్తం చేస్తాం

త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణలో అధికారం కోసం కేసీఆర్​ అమరవీరులను అవమానించారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(revanth reddy) మండిపడ్డారు. ప్రగతిభవన్​లో బందీ అయిన తెలంగాణను బంధవిముక్తం చేస్తామని పునరుద్ధాటించారు.

"తెలంగాణలో విద్యార్థులు, నిరుద్యోగులపై ఆంక్షలు, నిర్బంధాలు ఇంకెన్నాళ్లు?. నియంతలను తరిమికొట్టిన గడ్డ తెలంగాణ. తెలంగాణ ప్రజానీకం ఇంకెంతో కాలం కేసీఆర్‌ చేతిలో బందీగా ఉండదు. తెలంగాణ అమరవీరుల రుణం ఎప్పటికీ తీరనిది. అధికారం ఉందికదా అని చేతిలో ఉన్న బలగాలను, కొద్దిమంది అధికారులను అడ్డం పెట్టుకొని మమ్మల్ని నిర్బంధించొచ్చు. నిజాంల పైజామ్‌లు ఊడగొట్టిన చరిత్ర ఈ గడ్డకు ఉంది. ఎంతోమందికి పాఠాలు, గుణపాఠాలు నేర్పిన చరిత్ర ఉంది. తెలంగాణ అనేది ఒక ల్యాండ్‌మైన్‌. అణు విస్ఫో టనం చెందేముందు నివురుగప్పిన నిప్పులా ఉన్న సమాజం ఇది. చైతన్యం, స్ఫూర్తి, పోరాట పటిమతో కూడుకున్నది. త్యాగాల పునాదులపై ఏర్పడిన ఈ రాష్ట్రం కేసీఆర్‌ చేతిలో బందీగా ఉండదు. ఈ బంధనాలు తెంచుకుంటాం.. ప్రగతిభవన్‌లో బందీ అయిన తెలంగాణ తల్లికి రాష్ట్ర విద్యార్థులు, నిరుద్యోగ యువత బంధ విముక్తి కలిగిస్తుంది. అందుకు కాంగ్రెస్‌ నాయకత్వం వహిస్తుంది’" -రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

పోలీసుల నిర్బంధాలకు నిరసనగా రేపు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చాడు. పాలమూరు కేంద్రంగా పోరును ఉద్ధృతం చేస్తామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: REVANTH REDDY: 'తెలంగాణ ఇంకెంతో కాలం కేసీఆర్‌ చేతిలో బందీగా ఉండదు'

ABOUT THE AUTHOR

...view details