దేశంలో ఉన్న సంఘాలన్నింటిని కూడగట్టి ఒక వేదికపైకి తీసుకువచ్చిన ఘనత అఖిల భారత కిసాన్ సభదేనని ఆ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగానికి చేస్తున్న అన్యాయాలు, అక్రమాలను ఎదిరించటంలో ఎప్పుడూ ముందుందని పేర్కొన్నారు. అఖిల భారత కిసాన్ సభ 86వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్ నగరంలో తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం కార్యాలయంలో ఏఐకేఎస్ జెండాను ఆవిష్కరించారు.
'ఉగాది రోజు వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు'
ఉగాది రోజున వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేయాలని అఖిల భారత కిసాన్ జాతీయ ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి సూచించారు. అంబేడ్కర్ జయంతి రోజున రాజ్యాంగాన్ని పరిరక్షించాలనే నినాదంతో దేశవ్యాప్తంగా ప్రతిజ్ఞలు చేయాలన్నారు.
అన్ని జిల్లాల్లో జెండాలు ఎగురవేసి... కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని మల్లారెడ్డి కోరారు. ఉగాది రోజున వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలతోపాటు... ఏప్రిల్ 14వ తేదీ అంబేడ్కర్ జయంతి రోజున రాజ్యాంగాన్ని పరిరక్షించాలనే నినాదంతో దేశవ్యాప్తంగా ప్రతిజ్ఞలు చేయనున్నట్లు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగర్ వెల్లడించారు. అనంతరం సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.
ఇదీ చూడండి:మండు వేసవి కాలంలోనూ తాగు, సాగు నీటికి ఇబ్బంది లేదు: హరీశ్‌రావు