మరోసారి ఉద్యోగస్థులు సీఎం ఇంటి ముట్టడింపు, పోలీసుల్లో హైటెన్షన్ CPS employees agitation: ఈ ఏడాది ఫిబ్రవరి 3న ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడలోని బీఆర్‌టీఎస్ రోడ్డులో పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో ఉద్యోగులు ‘చలో విజయవాడ’ నిర్వహించారు. పోలీసులు అనుమతి నిరాకరించినా, ఎన్ని ఆంక్షలున్నా వివిధ జిల్లాల నుంచి విజయవాడకు ఉద్యోగులు పెద్దసంఖ్యలో చేరుకున్నారు. ముందుగానే వచ్చి నగరంలో బంధువులు, స్నేహితుల ఇళ్లలో దిగారు. పోలీసులు బస్సులు, రైళ్లు, హోటళ్లనే తనిఖీ చేశారు. వారు ఊహించని రీతిలో బీఆర్టీఎస్ రోడ్డులోకి వేలసంఖ్యలో చేరారు. పోలీసులు నియంత్రించలేని పరిస్థితి ఎదురైంది.
Police restrictions: ఈసారి మాత్రం విజయవాడ నగరం మొత్తాన్ని పోలీసులు జల్లెడ పడుతున్నారు. డేగ కన్నుతో నిఘా వేశారు. సీపీఎస్ రద్దు డిమాండ్‌తో సెప్టెంబరు ఒకటో తేదీన సీఎం ఇళ్లు ముట్టడి, ఛలో విజయవాడ కార్యక్రమానికి ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చిన తరుణంలో- గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు ముందస్తుగా అప్రమత్తమయ్యారు. ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని అన్ని సబ్ డివిజన్లతోపాటు విజయవాడలోని దక్షిణ, పశ్చిమ, తూర్పు డివిజన్లు, టాస్క్‌ఫోర్సు, ఆర్మ్‌డ్ రిజర్వు బలగాలతో నగరంలోని ప్రధాన కూడళ్లలో ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించారు. పైకి మాత్రం శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలకు మనోధైర్యం ఇచ్చేందుకు ఫ్లాగ్‌మార్చ్ చేపట్టినట్లు పోలీసులు చెబుతున్నారు.
ఇప్పటికే శాతవాహన కళాశాలలో సభ అనుమతి దరఖాస్తును.. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందన్న కారణంతో పోలీసులు తిరస్కరించారు. ప్రదర్శన, నిరసనలు జరగకూడదని విస్పష్ట ఆదేశాలతో అప్రమత్తమయ్యారు. శుక్రవారం రాత్రి లాడ్జీలు, హోటళ్లను తనిఖీ చేశారు. నిరసనల్లో పాల్గొనేవారికి గదులిస్తే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. వాహనాల తనిఖీలూ చేపట్టారు. గంపగుత్తగా గదులు బుక్ చేసేవారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని హోటళ్లు, ఫంక్షన్‌హాళ్ల యజమానులకు సూచించారు. ఉద్యోగులందరికీ 149 సీఆర్‌పీసీ నోటీసులు ఇస్తున్నారు. సీపీఎస్ ఆందోళనల్లో పాల్గొనవద్దని హెచ్చరిస్తున్నారు. పోలీసులతో ఉద్యమాలను ఆపలేరని ఉద్యోగ సంఘాల నాయకులు అంటున్నారు.
గత పరిస్థితులు పునరావృతం కాకుండాచూడడానికి పోలీసులు వ్యూహరచనలు చేస్తున్నారు. సెప్టెంబరు 1న సీఎం జగన్ కడప జిల్లా ఇడుపులపాయకు వెళ్లనున్నట్లు సమాచారం. ఆయన వాహనశ్రేణి జాతీయ రహదారి మీదుగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకోవాలి. కాన్వాయ్‌కు ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారిస్తున్నారు. గతంలో చలో విజయవాడ సందర్భంగా విజయవాడలోని ప్రధాన స్టేషనుకే పోలీసులు పరిమితమయ్యారు. శివారు స్టేషన్లపై నిఘా కొరవడింది. మధురానగర్, గుణదల తదితర స్టేషన్లలో ఉద్యోగులు పెద్దసంఖ్యలో దిగారు. అక్కడినుంచి పక్కనే ఉన్న బీఆర్‌టీఎస్ రోడ్డుపైకి సులువుగా చేరిపోయారు. ఈసారి ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఎలా ముందుకెళ్లాలనే అంశంపై దృష్టిపెట్టారు.
ఇవీ చదవండి: