తెలంగాణ ఆబ్కారీశాఖలో శాఖాపరమైన పదోన్నతులు, పోస్టింగ్‌ల ప్రక్రియ అస్తవ్యస్తంగా మారింది. అక్కడ ఏమి జరుగుతుందో ఎవరికి అంతుబట్టడం లేదు. పదోన్నతులు జీవో రాకుండానే కొందరికి పోస్టింగ్‌లు ఇవ్వడం... ఎక్సైజ్ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అదెలా సాధ్యమంటూ సీనియర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆబ్కారీశాఖ ప్రక్షాళనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పలు రకాల పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నిల్ ఇచ్చింది. వాటిని అదే శాఖలోని అధికారులకు పదోన్నతులు కల్పించడం ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుంది. అందులో భాగంగా ఆబ్కారీశాఖలో పదోన్నతులపై ఈ ఏడాది జనవరి 18 న సమావేశమైన డిపార్టమెంటల్ ప్రమోషన్స్ కమిటీ అర్హులైన115 మందికి పదోన్నతులు కల్పించేందుకు గ్రీన్ సిగ్నిల్ ఇచ్చింది. ఇందులో ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ల నుంచి సర్కిల్ ఇన్‌స్పెక్టర్లుగా 32 మందికి, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ల నుంచి ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్లుగా 27 మందికి, ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ల నుంచి 27 మందికి ఎక్సైజ్ సూపరింటెండెంట్లుగా, ఎక్సైజ్ సూపరింటెండెంట్ల నుంచి సహాయ కమిషనర్లుగా 20 మందికి, సహాయ కమిషనర్ల నుంచి డిప్యూటీ కమిషనర్లుగా నలుగురికి, డిప్యూటీ కమిషనర్ల నుంచి జాయింట్ కమిషనర్లుగా నలుగురికి, జాయింట్ కమిషనర్ నుంచి అదనపు కమిషనర్‌గా ఒకరికి పదోన్నతులు కల్పనకు సంబంధించి డీపీసీ అమోదం తెలిపింది. ఇందుకు సంబంధించి పదోన్నతుల జీవో వెంటనే ప్రభుత్వం నుంచి జారీ కావాల్సి ఉంది. రెండు మూడు రోజులు గ్యాప్ ఇచ్చి పదోన్నతులు పొందిన వారందరికి పోస్టింగ్‌లు ఇవ్వాలి. కానీ ఈ రెండు జీవోలు కూడా ఇప్పటి వరకు జారీ కాలేదు.
పోస్టింగ్‌లపై చర్చ
ఇదిలా ఉండగా మంగళవారం సహాయ కమిషనర్ నుంచి డిప్యూటీ కమిషనర్‌గా పదోన్నతి పొందిన డేవిడ్ రవికాంత్ రంగారెడ్డి డిప్యూటీ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటికే అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఖురేసిని మహబూబ్‌నగర్ డీసీగా నియమించారు. అప్పటి వరకు పోస్టింగ్‌లు ఇస్తూ జీవో వచ్చిన విషయం ఎవరికి తెలియదు. డీపీసీ ఆమోదం తెలిపిన వారిలో కేవలం 12 మందికి మాత్రమే పోస్టింగ్‌లు ఇస్తూ... జీవో ఇచ్చిన విషయం వెలుగులోకి వచ్చింది. ఆ ప్రత్యేక జీవో...ద్వారా.... సహాయకమిషనర్ నుంచి డిప్యూటీ కమిషనర్‌గా పదోన్నతి పొందిన నలుగురిలో ఒకరికి, ఎక్సైజ్ సూపరింటెండెంటు నుంచి సహాయ కమిషనర్లుగా పదోన్నతి పొందిన 20 మందిలో ముగ్గురికి, సహాయ ఎక్సైజ్ సూపరింటెండెంట్ల నుంచి ఎక్సైజ్ సూపరింటెండెంట్లుగా పదోన్నతి పొందిన 27 మందిలో ఎనిమిది మంది లెక్కన మొత్తం 12 మందికి పదోన్నతుల జీవోతో సంబంధం లేకుండానే పోస్టింగ్‌లు ఇచ్చారు. అది కూడా కీలకమైన స్థానాల్లో వారికి పోస్టింగ్‌లు ఇవ్వడంతో శాఖాపరంగా తీవ్ర చర్చకు దారి తీసింది. సినియారిటీని పక్కన పెట్టి జూనియర్లకు పెద్ద పీటవేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మే నెల 6 న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేరిట ఈ 12 మందికి తాత్కాలిక ప్రాతిపదికన పోస్టింగ్స్ ఇస్తూ....ఉత్తర్వు జారీ చేయగా, అదే నెల 22న ఎక్సైజ్‌శాఖ డైరెక్టర్ పేరున పోస్టింగ్‌లు ఇస్తూ....సర్క్యులర్ ఇచ్చారు. అయితే ఆ రెండు ఉత్తర్వులు కూడా బహిర్గతం కాకుండా జాగ్రత్త పడ్డారు. పదోన్నతుల జీవోతో పాటు....అందరికి ఒకేసారి పోస్టింగ్‌లు వస్తాయని భావించిన అధికారులు ఇవి వెలుగులోకి రావడంతో ఖంగుతిన్నారు.