Kodi Pandelu in AP : ఆంధ్రప్రదేశ్లో కోడిపందేలకు అనుమతి లేదని పోలీసులు చెప్పినా.. వాటిని పటాపంచలు చేస్తూ పుంజలను బరిలోకి దించారు నిర్వాహకులు. ఉమ్మడి గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కోడిపందేలు జోరుగా సాగాయి. కత్తికట్టకుండా, బెట్టింగ్ జరకుండా సంప్రదాయబద్ధంగా జరగాల్సిన పందేలు.. కోట్లు సంపాదించే అడ్డాగా మారిపోయాయి. పుంజలకు కత్తి కట్టి బరిలోకి వదలడంతో రక్తం చిందింది. కృష్ణా జిల్లా అంపాపురం, ఈడుపుగల్లులో భారీ ఎత్తున బరులు ఏర్పాటు చేశారు. పందెం రాయుళ్ల కోసం వాహనాల పార్కింగ్, భోజనాలు, అత్యాధునిక వసతులతో ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. పందేలను వీక్షించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి జనం తరలివచ్చారు. భీమవరంలో జరిగిన కోడిపందేల్లో మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు ఉత్సాహంగా పాల్గొన్నారు.
అనుమతివ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా : అధికార పార్టీ కనుసన్నల్లోనే కోళ్ల పందేలు యథేచ్ఛగా సాగుతున్నాయి. రోడ్డుపక్కనే బరులున్నా పోలీసులు కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడట్లేదు. బాపట్ల జిల్లా తీర ప్రాంతాల్లో విచ్ఛలవిడిగా పందేలు సాగుతున్నాయి. పెనుమూడిలో రోడ్డు పక్కనే బరులు ఉండటంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కోనసీమ జిల్లాలో గుండాటకు అనుమతివ్వకపోవడంతో ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి.. బెదిరించి మరీ రావులపాలెంలో గుండాట శిబిరాలను దగ్గరుండి ఏర్పాటు చేయించారు. కాకినాడ జిల్లా రాజుపాలెంలో గుండాటను పోలీసులు అడ్డుకోవడంతో వైసీపీ నాయకులు ధర్నాకు దిగారు. అనుమతివ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటామంటూ వైసీపీ నేత గుత్తుల వెంకటరమణ డీజిల్ బాటిల్‌తో బెదిరించారు. అనపర్తి ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి పోలీసులతో మాట్లాడటంతో చివరకు అనుమతించారు.