తెలంగాణ

telangana

ETV Bharat / state

అవినీతితో దిగజారుతున్న సహకార సంఘాలు - Co_Oparative_Socities

వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాల్లో అక్రమాలు రాజ్యమేలుతున్నాయి. ఇష్టారాజ్యంగా అవినీతికి పాల్పడుతున్న ఇన్‌ఛార్జి పాలకవర్గాలను, సిబ్బందిని జిల్లా సహకార అధికారులు... డీసీవోలే లంచాలు తీసుకొని కాపాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే తాజాగా ఇద్దరు జిల్లా సహకార అధికారులపై సర్కారు సస్పెన్షన్ వేటు వేయగా... అవినీతి, అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్న వివిధ స్థాయి అధికారులపై దర్యాప్తు చేస్తోంది.

అవినీతితో దిగజారుతున్న సహకార సంఘాలు

By

Published : Oct 31, 2019, 4:12 AM IST

Updated : Oct 31, 2019, 12:16 PM IST

రాష్ట్రంలో రైతులకు సహకారం అందించాల్సిన వ్యవసాయ సహకార సంఘాలు - ప్యాక్స్‌లో అవినీతి, అక్రమాలు రాజ్యమేలుతున్నాయి. ప్యాక్స్ పాలక వర్గాలకు ఐదేళ్ల పదవీకాలం... గత ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలోనే ముగిసింది. అప్పట్నుంచి ప్రతి 6 నెలలకోసారి అవే పాలకవర్గాలకు ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించడం ద్వారా పదవీ కాలం పొడిగిస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేస్తోంది. ఇలా జారీ చేయడానికి కొన్ని నిబంధనలు విధించింది. ఏమైనా అవినీతి ఆరోపణలు, నిధుల దుర్వినియోగం ఉన్న పాలకవర్గాలకు పదవీకాలం పొడగింపు ఇవ్వద్దనేది ప్రధాన నిబంధన. ఏదైనా సంఘంలో లొసుగులు ఉన్నట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకునే అధికారం జిల్లా సహకార అధికారులు డీసీవోలకే ఇచ్చారు. అయితే వారికి ముడుపులిస్తే ఏం కాదులే అన్న ధీమా ప్యాక్స్‌ సిబ్బందిలో నెలకొంది.

అవినీతితో దిగజారుతున్న సహకార సంఘాలు

ఎలా సంపాదిస్తున్నారో...

ఒక గ్రామం ప్యాక్స్‌లో చుట్టు పక్కల 5 నుంచి 10 గ్రామాల రైతులు సభ్యులుగా ఉంటారు. వ్యవసాయ పంటల సాగుకు అవసరమైన విత్తనాలు, రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు, ఇతర ఉపకరణాలు వంటివి ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు రైతులకు అమ్మాలి. అక్టోబరు నుంచి జూన్ దాకా రైతులు పండించిన పంటలను మద్ధతు ధరలకు కొనాలి. పంట రుణాలు ఇచ్చి తిరిగి వసూలు చేయాలి. ఈ పనుల్లో లెక్క పత్రం చూపకుండా అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారు.

గత ఆగస్టు, సెప్టెంబరులో యూరియా కొరత ఏర్పడటానికి ప్యాక్స్ సిబ్బంది, పాలకవర్గాలే కారణమని మార్క్‌ఫెడ్ ఇటీవల సహకార శాఖకు లేఖ రాసింది. ఖమ్మం అయ్యవారిగూడెం సొసైటీలో యూరియా అమ్మకాల్లో అవినీతి కారణంగా సీఈవోపై సస్పెండ్ వేటు పడింది. ఇదే జిల్లా తల్లాడ మండలం కలకొడిమ సహకార సంఘంలో 58 లక్షల రూపాయలు దుర్వినియోగానికి పాల్పడినందున సీఈవోను సస్పెండ్‌ చేశారు. రైతులు కట్టిన పంట రుణ బకాయిల సొమ్ము పాక్స్ సిబ్బంది, పాలకవర్గాలు తినేస్తుండటం వల్ల బకాయిలు అంతే ఉన్నట్లు రికార్డుల్లో కనిపిస్తోంది. దీనివల్ల రైతులకు కొత్త రుణాలు మంజూరు కాలేదు.

ఫిర్యాదులు వస్తేనే చర్యలు

లంచాలు తీసుకుంటున్న డీసీవోలపై ప్రభుత్వం వరకు ఫిర్యాదులు వస్తేనే వారిపై చర్యలకు ఆస్కారముంది. అప్పటిదాకా అక్రమాలు బయటపడటం లేదని సహకార శాఖ వర్గాలు తెలిపాయి. అసలు అంతంతమాత్రంగా ఉన్న సంఘాల ఆర్థిక పరిస్థితి అవినీతి వ్యవహారాలతో మరింత దిగజారుతోంది.

ఇవీ చూడండి: ప్రభుత్వ రంగ సంస్థల ఛైర్మన్​గా జీవన్​రెడ్డి బాధ్యతల స్వీకరణ

Last Updated : Oct 31, 2019, 12:16 PM IST

ABOUT THE AUTHOR

...view details