తెలంగాణ

telangana

ETV Bharat / state

ధరణిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష - కేంద్రం నిధులు ఏం చేశారని నిలదీత

CM Revanth Reddy Review on Dharani Portal : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధరణి పోర్టల్​పై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ భేటీకి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనర్సింహా, సంబంధిత అధికారులు హాజరయ్యారు. సమావేశంలో సీసీఎల్​ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. సమీక్ష అనంతరం నిషేధిత జాబితా, అసైన్‌ భూములు, పట్టా భూములు తదితర అంశాలతో పాటు సమావేశంలో మంత్రులు లేవనెత్తిన అన్ని అంశాలపై నివేదిక ఇవ్వాలని నవీన్‌ మిట్టల్‌ను సీఎం ఆదేశించారు.

CM Revanth Reddy review on Dharani in the Secretariat
CM Revanth Reddy Review on Dharani Portal

By ETV Bharat Telangana Team

Published : Dec 13, 2023, 3:46 PM IST

Updated : Dec 13, 2023, 9:00 PM IST

CM Revanth Reddy Review on Dharani Portal :ధరణి పోర్టల్‌పై సమగ్ర నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, భూయాజమాన్యం(Land Ownership) వివరాలు సులభంగా తెలుసుకునేందుకు గత బీఆర్​ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి వెబ్​ పోర్టల్​పై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టిసారించింది. ఈ పోర్టల్​లో చాలా లొసుగులు ఉన్నాయని ఎన్నికల ప్రచారంలో ఆరోపించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అధికారంలోకి రాగానే ధరణిని ప్రక్షాళన చేస్తామని గతంలో ప్రకటించారు.

అధికారం కోల్పోయిన ఇంకా ఆగని బీఆర్​ఎస్ నాయకుల కబ్జాలు : కొప్పుల నర్సింహా రెడ్డి

ధరణి పోర్టల్​లో మార్పులు చేసి దాని పేరును 'భూమాత'గా మారుస్తామని ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి ప్రకటించారు. అందులో భాగంగానే ఇవాళ ముఖ్యమంత్రి ధరణి పోర్టల్​పై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. దాదాపు 2 గంటలు సమయం పాటు ధరణిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఈ భేటీకి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy Chief Minister Bhatti Vikramarka), మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనర్సింహా, సీఎస్‌ శాంతికుమారి, రెవెన్యూ ఉద్యోగ సంఘాలు, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ధరణి లోటుపాట్లపై వారం, పది రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని సీసీఎల్‌ఏ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. వ్యవసాయ, వ్యవసాయేతర భూముల వివరాలు కూడా ఆ నివేదికలో పొందుపరచాలని స్పష్టం చేశారు. సుదీర్ఘంగా జరిగిన ఈ సమీక్షలో ధరణి యాప్ భధ్రతపై సీఎం ఆరా తీశారు. ధరణి పోర్టల్‌కు చెంది సీసీఎల్‌ఏ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ పవర్‌ పాయింట్‌(Power Point) ప్రజంటేషన్‌ ద్వారా వివరణ ఇచ్చారు.

మాజీమంత్రి మల్లారెడ్డి అతని అనుచరులపై 420 చీటింగ్ కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు

CM Revanth Reddy Ordered to Officials for Dharani :ధరణిపై లక్షల సంఖ్యలో ఫిర్యాదులు ఉన్నాయని, వీటి పరిష్కారానికి మండల స్థాయి గ్రీవిన్స్ సెల్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ధరణి లావాదేవీలపై వస్తున్న విమర్శలపై వివరణ ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. భూములు సర్వే చేయాలని, డిజిటలైజేషన్‌ చేయాలని, ఆన్‌లైన్‌ విధానం తీసుకురావాలని టైటిల్‌ గ్యారంటీ చట్టం(Title Guarantee Act) తీసుకొచ్చేందుకు కేంద్రం ఇచ్చిన రూ.83 కోట్లు నిధులు ఏమయ్యాయని అధికారులను సీఎం నిలదీశారు.

నిషేధిత జాబితా, అసైన్‌ భూములు, పట్టా భూములు తదితర అంశాలతో పాటు మంత్రులు అడిగిన, లేవనెత్తిన అన్నిఅంశాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని నవీన్‌ మిట్టల్‌కు ముఖ్యమంత్రి ఆదేశించారు. భూముల డిజిటలైజేషన్(Lands Digitization) కోసం గత ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్, సమస్యలకు నిలయంగా మారిందని రేవంత్‌రెడ్డి అన్నట్లు సమాచారం. ధరణిపై మరోసారి ఉన్నతాస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

శాసనమండలికి నూతన భవనం - రాష్ట్ర సర్కార్ ప్రతిపాదన

రాష్ట్రంలో 90 లక్షలకు పైగా రేషన్‌కార్డులు - 1.19 కోట్ల వంట గ్యాస్ వినియోగదారులు

Last Updated : Dec 13, 2023, 9:00 PM IST

ABOUT THE AUTHOR

...view details