తెలంగాణ

telangana

ETV Bharat / state

CM KCR Delhi Tour: 4న BRS కేంద్ర కార్యాలయం ప్రారంభం.. నేడు దిల్లీకి కేసీఆర్..! - హస్తినకు వెళ్లనున్న సీఎం కేసీఆర్

CM KCR Delhi Tour: దిల్లీలో నిర్మిస్తున్న బీఆర్​ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవానికి ముస్తాబవుతోంది. వసంత్ ​విహార్​లో నిర్మిస్తున్న నూతన కార్యాలయాన్ని ఈ నెల 4న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే హస్తినకు చేరుకున్న పార్టీ నేతలు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ నేడు సాయంత్రం లేదా రేపు ఉదయం దిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

CM KCR
CM KCR

By

Published : May 2, 2023, 4:06 PM IST

CM KCR Delhi Tour: దేశ రాజధాని దిల్లీలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం(తెలంగాణ భవన్​) ప్రారంభానికి సిద్ధమైంది. వసంత్ విహార్​లో 1,150 చదరపు మీటర్ల స్థలంలో.. మొత్తం ఐదు అంతస్తుల భవనాన్ని నిర్మించారు. బుధవారం(4వ తేదీ)రోజున నూతన కార్యాలయంలో బీఆర్​ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్.. పూజలు నిర్వహించి లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఇవాళ సాయంత్రం లేదా బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్ దిల్లీ వెళ్లే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

నూతన కార్యాలయంలో సీఎం కోసం ప్రత్యేక గది: దిల్లీలో పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభానికి రేపు ఒక్క రోజే గడువు ఉండటంతో.. మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంపీ సంతోశ్​కుమార్ దగ్గరుండి పనులు పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమం దృష్ట్యా ప్రశాంత్​రెడ్డి, సంతోశ్​ ​కుమార్ సోమవారం సాయంత్రమే హస్తినకు వెళ్లారు. నూతనంగా రూపుదిద్దుకున్న ఈ పార్టీ కార్యాలయంలో సీఎం కేసీఆర్ కోసం ప్రత్యేక గదితో పాటు మొత్తం 18 రూమ్​లు, కాన్ఫరెన్స్ హాలు ఉండేలా నిర్మించారు. అదేవిధంగా అతిథుల కోసం రెండు సూట్ రూమ్​లు కేటాయించారు. వివిధ కార్యక్రమాలు, పనుల నిమిత్తం పార్టీ కార్యాలయానికి వచ్చే వారి కోసం ప్రత్యేకంగా క్యాంటీన్ సౌకర్యం ఏర్పాటు చేశారు.

ఈ నెల 4న తెలంగాణ భవన్​ ప్రారంభోత్సవం: ఈ నెల 4న సుమూహర్తం ఉండటంతో అదే రోజు పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి బీఆర్​ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. 4వ తేదీ మధ్యాహ్నం 1.05 గంటలకు ముహూర్తం ఖరారు చేశారు. ఆ రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ వసంత్ విహార్​లోని కార్యాలయానికి చేరుకొని పూజా కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పండితులు హోమం, వాస్తు పూజలు నిర్వహించనున్నారు. ప్రారంభోత్సవం అనంతరం.. సుమారు గంట సేపు కొత్తగా నిర్మించిన కార్యాలయంలో సీఎం కేసీఆర్ గడపనున్నారు.

దిల్లీలో తెలంగాణ పదమే పలకడానికి, వినడానికి అవకాశాల్లేని పరిస్థితుల నుంచి ఇక్కడి నడిబొడ్డున బీఆర్​ఎస్ సొంత కార్యాలయ భవనాన్ని నిర్మించుకునే స్థాయికి చేరుకోవడం చాలా ఆనందంగా ఉందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. నిన్న దిల్లీ వెళ్లిన అనంతరం ప్రశాంత్​రెడ్డి, ఎంపీ సంతోశ్​​కుమార్ నూతన కార్యాలయానికి చేరుకుని అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. మరోవైపు అక్కడ ఉన్న బీఆర్​ఎస్ పార్టీ శ్రేణులు ఇప్పటికే ప్రారంభోత్సవ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details