తెలంగాణ

telangana

ETV Bharat / state

CM KCR: 19 నుంచి పల్లె, పట్టణప్రగతి పనుల ఆకస్మిక తనిఖీ

పల్లెలు, పట్టణాల్లో జరుగుతున్న ప్రగతి తీరును, అధికారుల పనితీరును పరిశీలించేందుకు ఈ నెల 19 తర్వాత ఆకస్మిక తనిఖీలు చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రకటించారు. పల్లె, పట్టణప్రగతి కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయన్న సీఎం.. చేరుకోవాల్సిన లక్ష్యాలు ఇంకా మిగిలే ఉన్నాయని అన్నారు. బాధ్యతల నిర్వహణలో పంచాయతీరాజ్ ఉద్యోగులు, అధికారులు విఫలమవుతున్నారన్న కేసీఆర్​.. నిర్లక్ష్యంతో వ్యవహరించినట్లు తన పర్యటనలో గుర్తిస్తే.. ఎవరినీ క్షమించబోనని హెచ్చరించారు. అదనపు కలెక్టర్లు ఆశించిన రీతిలో పనిచేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.

19 నుంచి పల్లె, పట్టణప్రగతి పనుల ఆకస్మిక తనిఖీ
19 నుంచి పల్లె, పట్టణప్రగతి పనుల ఆకస్మిక తనిఖీ

By

Published : Jun 12, 2021, 5:21 AM IST

పల్లెలు, పట్టణాలు బాగుచేసుకునేందుకు అదనపు కలెక్టర్లను నియమించాం. ఆ అధికారులు క్షేత్ర స్థాయిలో నిమగ్నమై డీపీవోలు సహా కింది స్థాయి ఉద్యోగులను ప్రోత్సహిస్తూ లక్ష్యాలను సాధించాలి. వారి నుంచి చాలా ఆశించినా.. ఆ స్థాయిలో పనితీరు లేదు.

రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టింది. పాజిటివిటీ రేటు 1.47 శాతానికి పడిపోయింది. కరోనా పూర్తిగా తగ్గిన తరువాత మరోవిడత పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు చేపడతాం. పచ్చదనం పెంచేందుకు అటవీశాఖ ప్రత్యేక కార్యాచరణ కొనసాగించాలి.
అభివృద్ధి కంటికి కనిపించినపుడే ప్రజలు.. ప్రజాప్రతినిధుల వెంట నడుస్తారు. ఆ దిశగా ఇప్పటికే విజయం సాధించిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు దేశంలోనే అత్యుత్తమమైనవిగా గుర్తింపు పొందాయి. ఈ నేపథ్యంలో అలసత్వం వదిలి మరింత పట్టుదలతో అధికారులు పనిచేసి తెలంగాణను అద్దంలా తీర్చిదిద్దాలి.- సీఎం కేసీఆర్​

పల్లెప్రగతి, పట్టణ ప్రగతి అమలవుతున్న తీరు, అధికారులు, సిబ్బంది పనితీరు, చేపట్టాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్​ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో ప్రగతిభవన్‌లో సమావేశమైన సీఎం.. సంబంధిత అంశాలపై చర్చించారు. పల్లెలు, పట్టణాల అభివృద్దికి దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తోందన్న ఆయన.. వినూత్నంగా చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని తెలిపారు. చేరుకోవాల్సిన లక్ష్యాలు మిగిలే ఉన్నాయని వ్యాఖ్యానించారు. నిర్దేశిత బాధ్యతలు నిర్వర్తించడంలో పంచాయతీరాజ్ ఉద్యోగులు, అధికారులు ఎందుకు వైఫల్యం చెందుతున్నారో తెలుసుకోవాల్సి ఉందన్నారు.

గ్రామాలు, పట్టణాలు పచ్చదనం, పరిశుభ్రతతో ఉంచడం కంటే మించిన పని లేదని.. ఆ కార్యక్రమాలను నిత్యం కొనసాగించాలని చెప్పారు. పథకాలు ప్రారంభించి రెండేళ్లు గడిచిపోయాయని ఇక తాను రంగంలోకి దిగక తప్పదని సీఎం తెలిపారు. ఈ నెల 19 తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. తగిన సమయం ఇవ్వాలనే ఇన్ని రోజులు పర్యటన చేపట్టలేదని.. స్వయంగా అన్నింటినీ పరిశీలిస్తానని చెప్పారు. తాత్సారం జరిగినట్లు, నిర్లక్ష్యంతో వ్యవహరించినట్లు గుర్తిస్తే ఎవరినీ క్షమించబోనని హెచ్చరించారు.

చార్టు రూపొందించాలి..

గ్రామాలు, పట్టణాల్లో ఇప్పటివరకు జరిగిన పనుల వివరాలతో ఒక చార్టు రూపొందించాలని సీఎస్​ను ముఖ్యమంత్రి ఆదేశించారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి చార్టులను వేర్వేరుగా సమగ్ర వివరాలతో తయారుచేయాలని స్పష్టంచేశారు. ఉత్తమ, అధ్వాన గ్రామాలు, మండలాలను గుర్తించి వాటికి కారణాలనూ ప్రత్యేకంగా పేర్కొనాలని ఆదేశించారు. పురోగతి, వెనుకబాటు అంశాల ఆధారంగా మంచి, చెడులను రెండింటిని ప్రాతిపదికగా తీసుకుని చార్ట్‌ తయారు చేసి, పర్యటనలో తనకు అందించాలని సీఎస్​కు తెలిపారు. అలసత్వం వహించిన ఏ స్థాయి అధికారినైనా ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు.

అనుకున్న రీతిలో పనితీరు లేదు..

పల్లెలు, పట్టణాలను బాగు చేసుకోవడానికే అదనపు కలెక్టర్లను నియమించామని.. వారు నిరంతరం క్షేత్రస్థాయిలో ఉండి లక్ష్యాన్ని సాధించాలన్నారు. అదనపు కలెక్టర్లు అనుకున్న రీతిలో పని సామర్థ్యాన్ని నిరూపించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను చాలా ఆశించానన్న ముఖ్యమంత్రి.. అనుకున్నంత స్థాయికి వారి పనితీరు చేరడం లేదని అన్నారు. కేవలం పంచాయతీరాజ్, పురపాలక శాఖల మంత్రులు మాత్రమే అన్నీ చేయాలనుకోవడం సరికాదని తెలిపారు. స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులందరూ పల్లె, పట్టణ ప్రగతిలో మరింతగా భాగస్వాములు కావాలని తెలిపారు. ప్రజలను చైతన్యపరిచి వారిని మరింతగా భాగస్వాములను చేయాలని సీఎం వివరించారు. పల్లెప్రగతి, పట్టణప్రగతి క్షేత్రస్థాయి పనితీరును సమీక్షించేందుకు ఆదివారం అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులతో ప్రగతిభవన్​లో సమావేశం కానున్నట్లు చెప్పారు.

ముందస్తుగానే గుర్తించి అరికట్టడం ముఖ్యం..

సీజనల్ వ్యాధులను ముందస్తుగానే అరికట్టేందుకు గ్రామాల్లో ఇకనుంచి సీజన్ వారీగా చార్ట్ తయారు చేయాలని సీఎం అధికారులకు సూచించారు. కరోనా వంటి మహమ్మారి నేపథ్యంలో సీజనల్ వ్యాధులను ముందస్తుగానే గుర్తించి అరికట్టడం అతి ముఖ్యమన్నకేసీఆర్​.. ఇందుకోసం పంచాయితీరాజ్, పురపాలక, వైద్య-ఆరోగ్య శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. తెలంగాణ ముఖచిత్రానికి జాతీయ రహదారులు అద్దం పడుతాయని.. వాటివెంట పచ్చని చెట్లు పెంచాలని కేసీఆర్ తెలిపారు. మొక్కలు పెంచి సంరక్షించే బాధ్యత సంబంధిత గుత్తేదారులదే కాబట్టి వారితో మొక్కలు నాటించే కార్యక్రమాన్ని పట్టుబట్టి చేయించాలని చెప్పారు. అడవుల పునరుజ్జీవనంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. పురపాలకశాఖ సంచాలకులు, పంచాయతీరాజ్ కమిషనర్ జిల్లాలు, గ్రామాల్లో పర్యటించి ప్రజలతో మమేకమై ప్రగతి తీరును పరిశీలించాలని స్పష్టంచేశారు. డీపీవోలనూ పల్లెల పర్యటనల్లో నిమగ్నం చేయాలని స్పష్టం చేశారు. గ్రామాలు, పురపాలికల పరిధిలో అక్రమ లేఅవుట్లు యథావిధిగా కొనసాగుతున్నట్లు సమాచారం ఉందన్న ముఖ్యమంత్రి.. వాటిని గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

మరో విడత పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి..

కరోనా పూర్తిగా తగ్గాక త్వరలోనే మరో విడత పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను చేపడతామని సీఎం తెలిపారు. అభివృద్ది కళ్లకు కనిపించినప్పుడే ప్రజలు ప్రజాప్రతినిధుల వెంట నడుస్తారని అన్నారు. ఇప్పటికే విజయం సాధించిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు దేశంలోనే ఉత్తమమైనవిగా గుర్తింపు పొందాయని పేర్కొన్నారు. అలసత్వాన్ని వదిలి మరింత పట్టుదలతో పనిచేసి తెలంగాణను అద్దంలా తీర్చిదిద్దుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: PRC: ఉద్యోగులకు తీపికబురు... పీఆర్సీ అమలుపై ఉత్తర్వులు జారీ

ABOUT THE AUTHOR

...view details