CM KCR Warns BRS Sitting MLAs : 'మీ అంతట మీరు పొరపాట్లు చేస్తే తప్ప.. ఈసారి ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలెవరినీ మార్చే ఉద్దేశం లేదు' అని సీఎం కేసీఆర్ ఇటీవల కొన్ని సందర్భాల్లో సూచనప్రాయంగా చెప్పారు. ఈ నేపథ్యంలోనే క్షేత్రస్థాయి నుంచి వచ్చే సమాచారం ఆధారంగా.. పని తీరు సరిగా లేని వారిని పిలిచి.. కేసీఆర్ హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంపై పూర్తిగా దృష్టి సారించడం లేదని, ఎక్కువ కాలం బయటే గడుపుతున్నారని, మారకుంటే ఇబ్బంది తప్పదంటూ ఒకరికి.. కింది స్థాయి నాయకులను కలుపుకొని వెళ్లడం లేదని మరొకరికి.. ఇలా పలువురు ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి మందలించినట్లు తెలిసింది.
KCR trying for Hattrick in TS Assembly elections : నియోజకవర్గంపై పట్టులేని వారు, పలు విషయాల్లో వెనుకబడిన ఎమ్మెల్యేలు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని అప్రమత్తం చేస్తూ.. నడవడిక మార్చుకోకుంటే నిర్ణయం మరోలా ఉంటుందని సీఎం కేసీఆర్ చెప్పినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఎమ్మెల్యేల పని తీరు, ప్రభుత్వ పథకాలపై క్రమం తప్పకుండా సర్వేలు చేయించడం, నిఘా వర్గాల ద్వారా సమాచారం తీసుకుంటున్న ముఖ్యమంత్రి.. దారి తప్పుతున్న వారిని గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. చెప్పిన తర్వాత పని తీరులో మార్పు రాకుంటే ఏం చేయలేమని కేసీఆర్ వారికి స్పష్టం చేస్తున్నట్లు సమాచారం.
15 మందికి హెచ్చరికలు..: గత ఎన్నికల్లో బాగా వ్యతిరేకత ఉన్న.. గెలవడం అసాధ్యమనుకున్న వారిని మాత్రమే మార్చిన విషయాన్ని పార్టీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. అప్పట్లో అలా అభ్యర్థులను మార్చిన స్థానాలు బీఆర్‌ఎస్‌కు దక్కాయి. ఇప్పుడూ అదేవిధంగా వ్యవహరించే అవకాశం ఉందని.. ఇందులో భాగంగానే చివరి అవకాశంగా కొందరు ఎమ్మెల్యేలను సీఎం పిలిచి మాట్లాడుతున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. తుది హెచ్చరికలు చేసిన, చేయనున్న వారు సుమారు 15 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే.. నియోజకవర్గంపై పూర్తిగా దృష్టి పెట్టడం లేదని, మార్పు రావాలని సీఎం హెచ్చరించినట్లు సమాచారం. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల నుంచి ఒక్కొక్కరిని ఆ విధంగానే పిలిచి మాట్లాడినట్లు తెలిసింది.
ప్రచారం మొదలెట్టిన డీహెచ్..:కొల్లాపూర్‌లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు గత ఎన్నికల్లో ఓడిపోగా.. అక్కడ కాంగ్రెస్ నుంచి గెలిచిన హర్షవర్ధన్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరారు. టికెట్ కోసం ఇద్దరి మధ్య పోటీ నెలకొనడంతో పాటు.. పార్టీలోని కొందరు నాయకులు జూపల్లి వైపు మొగ్గుచూపినా ముఖ్యమంత్రి అంగీకరించలేదని తెలిసింది. చివరకు జూపల్లి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడగా ఆయనను సస్పెండ్ చేశారు. కొత్తగూడెంలో వనమా వెంకటేశ్వరరావు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండగా.. టికెట్ కోసం ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావుతీవ్రంగా యత్నిస్తున్నారు. నియోజకవర్గంలో తరచూ పర్యటిస్తూ.. అంతర్గతంగా ప్రచారం చేసుకొంటున్నారనే అభిప్రాయం ఉంది.