హైదరాబాద్‌లో తెరాస ప్లీనరీ (TRS PLENARY) వేదికగా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఉద్యమ ప్రస్థానం, రాష్ట్ర అభివృద్ధిపై (Kcr at Plenary) ప్రసంగించారు. తెలంగాణ వస్తే చీకట్లు అలుముకుంటాయని, అభివృద్ధి కుంటుపడుతుందని దుష్ప్రచారం చేశారని గుర్తుచేశారు. రాజీలేని పోరాటంతో తెలంగాణ సాధించుకుని... అలుపులేకుండా అభివృద్ధి బాటలో పరుగెడుతున్నామన్నారు. దళితబంధు ఉద్యమం దేశాన్ని తట్టి లేపుతుందని కేసీఆర్ (KCR) ధీమా వ్యక్తం చేశారు. పటేల్, పట్వారీ వ్యవస్థను ఎన్టీఆర్ రద్దు చేసినట్లే వీఆర్వో (VRO) వ్యవస్థను తీసి పడేశామన్నారు. రాబోయే ఏడేళ్లలో బడ్జెట్ల ద్వారా మొత్తం 23 లక్షల కోట్ల ఖర్చు చేస్తామని చెప్పారు. దళితబంధు వృథా కాదని ఆర్థిక పరిపుష్ఠికి తోడ్పడుతుందని పేర్కొన్నారు.
ఆగని అభివృద్ధి...
అనేక రంగాల్లో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని ముఖ్యమంత్రి (Kcr at Plenary) వెల్లడించారు. కరోనా సంక్షోభంలోనూ అభివృద్ధి ఆగలేదనన్న సీఎం.. 2028లో రాష్ట్ర బడ్జెట్ 4.28 లక్షల కోట్లుగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. లక్షా 70వేల నుంచి 2లక్షల 35వేలకు చేరిన రాష్ట్ర తలసరి ఆదాయం 2028లో 7.76 లక్షలకు చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మన పథకాలు చూసి ఇతర రాష్ట్రాల సీఎంలు ఆశ్చర్యపోతున్నారని కేసీఆర్ అన్నారు. తెలంగాణలో తమ జిల్లాలను కలుపుకోవాలని పొరుగు రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారని వెల్లడించారు. ఎన్నికల సంఘం తీరుపై ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు. రాజ్యాంగ పరిధి దాటి వ్యవహరిస్తోందన్న కేసీఆర్... ఎవరికి ఏ పద్ధతిలో జవాబు చెప్పాలో ఆ పద్ధతిన చెబుతామని హెచ్చరించారు.