తెలంగాణ

telangana

ETV Bharat / state

CM KCR Speech: 'కేసీఆర్ ఏదనుకుంటే అది కావాల్సిందే.. ఎలా ఆపుతారో నేనూ చూస్తా..' - దళితబంధు పథకం

భాజపా మాజీ నేత పెద్దిరెడ్డితో పాటు సర్గం రవి... సీఎం కేసీఆర్​ సమక్షంలో తెరాస తీర్థం పుచ్చుకున్నారు. పెద్దిరెడ్డి, సర్గం రవికి తెరాస కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్ర ప్రగతి ప్రస్థానంలో తాము భాగస్వామ్యమవుతామని వచ్చినందుకు వారికి... వారి అనుచరులకు కేసీఆర్​ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పలు అంశాలపై ముఖ్యమంత్రి మాట్లాడారు.

cm kcr speech on dalitha bandhu scheme in occasion of peddireddy joining
cm kcr speech on dalitha bandhu scheme in occasion of peddireddy joining

By

Published : Jul 30, 2021, 6:16 PM IST

Updated : Jul 30, 2021, 7:22 PM IST

కేసీఆర్ ఏదనుకుంటే అది కావాల్సిందే.. ఎలా ఆపుతారో నేనూ చూస్తా..

అనేక విషయాల్లో దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్​ ఉద్ఘాటించారు. ఈ విషయాన్ని పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రులే స్పష్టం చేస్తున్నారని గుర్తుచేశారు. భాజపా మాజీ నేత పెద్దిరెడ్డి, సర్గం రవిని ముఖ్యమంత్రి కేసీఆర్​... తెరాస కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పెద్దిరెడ్డి తనకు సన్నిహిత మిత్రులని సీఎం కేసీఆర్‌ తెలిపారు. రాష్ట్ర ప్రగతి ప్రస్థానంలో పెద్దిరెడ్డి చేదోడువాదోడుగా ఉంటారని వెల్లడించారు. రాష్ట్ర ప్రగతిలో తాము భాగస్వామ్యులవుతామని వచ్చినందుకు పెద్దిరెడ్డి, సర్గం రవి... వారి అనుచరులకు కేసీఆర్​ కృతజ్ఞతలు తెలిపారు.

రైతు బీమాలాగే... చేనేతలకు, ఎస్సీలకు..

"తెలంగాణ వచ్చిన తొలినాళ్లలో చాలా ఇబ్బందులు ఉండేవి. ఇప్పుడు వాటినన్నింటిని అధిగమించి.. రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్నాం. రైతు బంధు, కల్యాణ లక్ష్మి, పింఛన్​ లాంటి ఎన్నో పథకాలతో పేదలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్నాం. రైతు మరణిస్తే... ఆ కుటుంబానికి వారం నుంచి పది రోజుల్లోపు బీమా అందిస్తున్న ఏకైక రాష్ట్ర తెలంగాణ. రైతు బంధు, రైతు బీమా అమలుకు ఏడాది పట్టింది. ఈ పథకాలను అమలు చేసేటప్పుడు మొదట్లో చాలా సవాళ్లు ఎదుర్కొన్నాం. చేనేత కార్మికులకు రైతు బీమా తరహా సౌకర్యం కల్పిస్తాం. రాష్ట్రంలో ప్రతి 5 వేల ఎకరాలకు ఒక అధికారి ఉన్నారు. సామాజిక వివక్షకు గురైనవారికి పకడ్బందీగా కార్యక్రమాలు అమలు చేస్తున్న రాష్ట్రం... దేశంలో ఏదైనా ఉందంటే అది తెలంగాణనే. ఎస్సీ సంక్షేమ శాఖలోనూ రైతు బీమా తరహా ఏర్పాట్లు చేయాలని ఆ శాఖ మంత్రి, అధికారులకు సూచించాం." - కేసీఆర్​, ముఖ్యమంత్రి

వంద శాతం అమలుచేస్తాం...

"రాష్ట్రంలో ఎక్కడ ఏం అవసరముందో గుర్తించి వాటిని ప్రభుత్వమే సమకూర్చుకుంటూ పోతుంది. ఇప్పుడు తీసుకొచ్చిన పథకాలన్ని ఎవరు అడగలేదు. అవసరం తెలుసుకుని ప్రభుత్వమే అమలు చేస్తోంది. ఇదే క్రమంలో.. అనేక ఏళ్ల నుంచి తలపెట్టిన దళితబంధు అనే కార్యక్రమానికి స్వరూపం ఇచ్చి దాన్ని అమలు చేయాలని ప్రణాళికలు రచించాం. దాన్ని చూసి కొందరు నాయకులు అదిరి పడుతున్నారు. అవాక్కులు చవాక్కులు పేలుతున్నారు. దళితబంధు పథకాన్ని ఎలా ఆపుతారో చూస్తా. ఆరు నూరైనా... ఒక్కసారి కేసీఆర్​ చెప్పాడంటే అది ఆగదు. వంద శాతం అమలు చేసి తీరుతాం. దాన్ని దశల వారిగా... మన ఆర్థిక పరిమితులను బట్టి ఏడాదికి రెండు నుంచి నాలుగు లక్షల కుటుంబాలను ఆదుకోవాలని ప్రణాళికలు వేసుకున్నాం. అందుకే లక్ష కోట్లు అయినా ఖర్చు పెడతామని ప్రకటించా. దానికి కూడా విపక్షాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. జరగని పనులు చేస్తామని, గారడీ మాటలు చెప్పి ప్రజలను మోసం చేయాల్సిన అవసరం లేదు. నన్ను చంపినా అలాంటి మాటలు చెప్పను. ప్రజాస్వామ్యంలో ప్రజల మనసులు గెలుచుకుని అధికారంలోకి వచ్చి దాన్ని నిలబెట్టుకునేందుకు కష్టపడాలి." - కేసీఆర్​, ముఖ్యమంత్రి

ఉజ్వల భవిష్యత్తు ఉంది...

తెలంగాణ కచ్చితంగా ధనిక రాష్ట్రమన్న ముఖ్యమంత్రి.... జాతీయ తలసరి ఆదాయం కంటే రాష్ట్ర తలసరి ఆదాయం ఎక్కువ అని తెలిపారు. రాష్ట్రానికి పరిశ్రమలు వెల్లువెత్తుతున్నాయని పేర్కొన్నారు. జీఎస్​డీపీ(GSDP)లో వ్యవసాయం వాటా 17 శాతం ఉందన్నారు. రాష్ట్రంలో ఆకలి చావులు లేవని.. ఆత్మహత్యలు లేవని కేంద్రమే చెబుతోందని పేర్కొన్నారు. పథకాల అమలులో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. దేశంలోనే తెలంగాణ నంబర్‌ వన్‌గా ఉందన్నారు. మన పథకాలు నచ్చి సరిహద్దు రాష్ట్రాల ప్రజలు తమను తెలంగాణలో కలపాలని తీర్మానం చేసుకున్నట్లు గుర్తుచేశారు. దేశంలోని రాష్ట్రాలే కాకుండా పక్క దేశాలు కూడా వచ్చి పథకాల అమలును నేర్చుకుని పోయే అవకాశముందని కేసీఆర్​ పేర్కొన్నారు. తెలంగాణ వృద్ధి సాగుతోందన్న కేసీఆర్​... రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని తెలిపారు.

ఇవీ చూడండి:

Last Updated : Jul 30, 2021, 7:22 PM IST

ABOUT THE AUTHOR

...view details