తెలంగాణ

telangana

ETV Bharat / state

భూ క్రమబద్ధీకరణ పైసలతో ఖజానా నింపుకునే యోచన లేదు : కేసీఆర్‌ - ధరణి పోర్టల్‌, వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై చర్చ

cm-kcr-said-there-is-no-plan-to-fill-the-treasury-with-land-regularization-money
భూ క్రమబద్ధీకరణ పైసలతో ఖజానా నింపుకునే యోచన లేదు : కేసీఆర్‌

By

Published : Sep 24, 2020, 7:47 PM IST

Updated : Sep 24, 2020, 9:11 PM IST

19:30 September 24

భూ క్రమబద్ధీకరణ పైసలతో ఖజానా నింపుకునే యోచన లేదు : కేసీఆర్‌

కొత్త చట్టాల అమలు సందర్భంగా ఏ ఒక్క నిరుపేదకూ కష్టం వాటిల్లకుండా చివరి గుడిసె వరకు ఫలితాలు అందేలా చూడడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రజలే కేంద్ర బిందువులుగా, వారి సంక్షేమమే ధ్యేయంగా తీసుకొస్తున్న చట్టాల అమలు కోసం ప్రజాప్రతినిధులు, అధికారులు 24 గంటల పాటు శ్రమించాల్సిన అవసరం ఉందని అన్నారు. భారీ మెజార్టీతో గెలిపించి వారి గుండె తీసి చేతుల్లో పెట్టిన ప్రజల కోసం అహర్నిశలూ కష్టపడాల్సిన బాధ్యత ఉందని సీఎం వ్యాఖ్యానించారు. భూముల క్రమబద్ధీకరణ ద్వారా సర్కార్ ఖజనాను నింపుకోవాలని ప్రభుత్వం చూడడం లేదన్న ఆయన.. ధరణి పూర్తి స్థాయిలో రూపుదిద్దుకునే లోపే ప్రజల భూములు, ఆస్తుల సమస్యలన్నింటికీ శాశ్వతంగా విధానపర పరిష్కారాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

శ్రమించాల్సిన బాధ్యత

ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న నివాస స్థలాలు, సంబంధిత భూ సమస్యల పరిష్కారం విషయమై గ్రేటర్ హైదరాబాద్ సహా నగరపాలికల పరిధిలోని ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. ప్రగతిభవన్​లో జరిగిన సమావేశంలో పలువురు మంత్రులు, శాసనసభ్యులు, మేయర్లు, పురపాలకశాఖ అధికారులు పాల్గొన్నారు. పట్టణాల్లో ఇప్పటికీ ఆన్​లైన్​లో నమోదుకాని ప్రజల ఇళ్లు, ప్లాట్లు, అపార్టుమెంట్ ఫ్లాట్స్, వ్యవసాయేతర ఆస్తుల వివరాలను ఆన్​లైన్​లో నమోదు చేసే ప్రక్రియలో క్షేత్రస్థాయిలో భాగస్వాములు కావాలని సీఎం వారికి సూచించారు. భూముల ధరలు పడిపోతాయని గిట్టనివాళ్లు రాష్ట్ర ఆవిర్భావ సమయంలో శాపాలు పెట్టారని.. ప్రభుత్వ చర్యలతో ఆ అంచనాలను తలకిందులు చేస్తూ వ్యవసాయ, వ్యవసాయేతర భూములకు విపరీతంగా డిమాండ్ పెరుగుతోందని సీఎం అన్నారు. సుస్థిర పాలన వల్ల భూతగాదాలు, కబ్జాలు, దౌర్జన్యాలు, వేధింపులు, గుండాగిరీ తగ్గిందన్న ఆయన.. కళ్లకు కడుతున్న అభివృద్ధి, హైదరాబాద్ నగరానికి ఉండే గంగా జమునా సంస్కృతిని ద్విగుణీకృతం చేసిందని వివరించారు. భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలు వారు గుండెలు తీసి చేతుల్లో పెట్టారని, చారిత్రక విజయాన్ని కట్టబెట్టి కడుపులో పెట్టుకున్నారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. అటువంటి ప్రజల కోసం అహర్నిశలూ శ్రమించాల్సిన బాధ్యత ఉందని ప్రజాప్రతినిధులకు హితవు పలికారు.

ఖజానా నింపుకోవాలని కాదు

స్వయం పాలనలో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న విప్లవాత్మక పాలనా సంస్కరణల్లో భాగంగా అమలు చేస్తున్న వినూత్న చట్టాలు పదికాలాలపాటు ప్రజలకు మేలు చేస్తామని ముఖ్యమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. అమలు క్రమంలో నిరుపేదలకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చట్టాలను జాగ్రత్తగా  కార్యాచరణలో పెట్టాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులు, అధికారులపైనే ఉందని అన్నారు. భూములను క్రమబద్దీకరించడం ద్వారా పేదల నుంచి వచ్చే పైసలతో ఖజానా నింపుకోవాలని తమ ప్రభుత్వం చూడటం లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ధరణి పూర్తిస్థాయిలో రూపుదిద్దుకునే లోపే ప్రజలు ఎదుర్కొంటున్న భూములు, ఆస్తుల సమస్యలన్నింటినీ గుర్తించి, వాటికి విధానపరమైన పరిష్కారాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్​తోపాటు అన్ని పట్టణాలు, పల్లెల్లో నివాస స్థలాల సమస్యలేకాకుండా, దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న నిర్మాణాలు, ఇళ్లు, ఆస్తుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 

సూక్ష్మ సమాచారాన్ని సైతం

గుణాత్మక మార్పుకోసం, ప్రజల జీవితాల్లో పరివర్తన కోసం చట్టాల్లో మార్పులు తెచ్చినపుడు పేదలకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ధరణి వెబ్​పోర్టల్ వినియోగంలోకి రావడం వల్ల ఈ లక్ష్యం నెరవేరుతుందన్న సీఎం.. పేదల ఆస్తులకు పూర్తి రక్షణ దొరుకుతుందని అభిప్రాయపడ్డారు. వ్యవసాయ భూములకు ఆకుపచ్చ పాసుపుస్తకాల తరహాలో వ్యవసాయేతర ఆస్తులకు మెరూన్ రంగు పాసుపుస్తకాలు ఇవ్వడం ద్వారా ప్రజలకు సంబంధించిన ప్రతి అంగుళం ఆస్తిని ఆన్​లైన్​లో నమోదు చేస్తామని చెప్పారు. నోటరీ, 58, 59 జీఓల ద్వారా పట్టాలు పొందిన లబ్దిదారులు, దశాబ్దాలుగా ఇళ్లు కట్టుకుని నివసిస్తున్న పేదలకు మేలు చేకూర్చేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని ముఖ్యమంత్రి తెలిపారు. ఎన్ని పనులున్నా రద్దు చేసుకుని ప్రజా ప్రతినిధులు, అధికారులు వార్డుల వారీగా తిరిగి ప్రజల ఆస్తుల వివరాలు సేకరించి ఆన్​లైన్​లో పొందుపరిచేలా చూడాలని స్పష్టం చేశారు. భూములు, ఆస్తులకు సంబంధించిన సూక్ష్మ సమాచారాన్ని సైతం నమోదు చేయాలని సీఎం తెలిపారు.

పండుగ వాతావరణం

సమావేశంలో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, మేయర్లు... వారి ప్రాంతాల్లో ప్రజల నివాస స్థలాలు, ఇళ్లు, ఆస్తులకు సంబంధించి దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రికి వివరించారు. సమస్యలను సానుకూలంగా విన్న సీఎం కేసీఆర్.. ప్రతి సమస్యనూ అధికారులతో నోట్ చేయించి వాటి తక్షణ పరిష్కారం కోసం విధివిధానాలు రూపొందించాలని ఆదేశించారు. హైదరాబాద్​తోపాటు రాష్ట్రంలోని మున్సిపాలిటీల నివాస స్థలాలకు సంబంధించిన సమస్యలను ఇంత క్షుణ్ణంగా, లోతుగా పరిశీలించిన ముఖ్యమంత్రిని తాము ఇప్పటి వరకు చూడలేదని పలువురు సీనియర్ ప్రజా ప్రతినిధులు వ్యాఖ్యానించారు. పట్టణ, పేదల జీవితాల్లో వెలుగులు నింపేలా సీఎం కేసీఆర్ దార్శనికతతో తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చాయని ఆనందం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి :హైదరాబాద్‌లో రేపటి నుంచి సిటీ బస్సులు

Last Updated : Sep 24, 2020, 9:11 PM IST

ABOUT THE AUTHOR

...view details