CM KCR on Independence day: దేశభక్తి, స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి ప్రజలందరిలో రగిలేలా స్వతంత్ర భారత వజ్రోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. విద్యార్థులు, ఉద్యోగులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, యువతీ యువకులు సహా యావత్ తెలంగాణ సమాజం ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. వజ్రోత్సవాల సందర్భంగా ఈ నెల 21న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని, అదేరోజు రాష్ట్రవ్యాప్తంగా గ్రామపంచాయతీలు, మండల పరిషత్‌లు, జడ్పీలు, నగర, పురపాలికల్లో ప్రత్యేక సమావేశాలుంటాయని వెల్లడించారు. ఉత్తమ గ్రామపంచాయతీ, మున్సిపాలిటీ, పాఠశాల, రైతు, వైద్యుడు, ఇంజినీర్, పోలీస్ అధికారి, కళాకారుడు, గాయకుడు, కవి తదితరులను గుర్తించి సత్కరిస్తామని వివరించారు. రాష్ట్రంలో మొత్తం 1.20 కోట్ల గృహాలపై ఎగురవేసేందుకు జాతీయ జెండాలను ఉచితంగా పంపిణీ చేస్తామని తెలిపారు. ఆగస్టు 8 నుంచి 22 వరకు నిర్వహించనున్న వజ్రోత్సవ ద్విసప్తాహం కార్యక్రమాలపై సీఎం కేసీఆర్ మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వజ్రోత్సవాల నిర్వహణ కమిటీ ఛైర్మన్ కేశవరావు సహా 24 మంది సభ్యులు, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, సబితారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, సీఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఘనంగా ప్రారంభోత్సవం:వజ్రోత్సవాల ప్రారంభోత్సవాన్ని హెచ్ఐసీసీలో ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆర్మీ/పోలీస్ బ్యాండ్‌తో రాష్ట్రీయ వందనం, జాతీయ గీతాలాపన, సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన జరపాలని నిర్ణయించారు. కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు.. మొత్తం రెండువేల మంది పాల్గొంటారు. సీఎం ప్రత్యేక సందేశం ఇస్తారు.
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే కార్యక్రమాల్లో కొన్ని..
* ఈ నెల 8 నుంచి 22 వరకు ప్రభుత్వ, ఇతర ప్రతిష్ఠాత్మక భవనాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాలు, స్టార్ హోటళ్లు, దవాఖానాలు, షాపింగ్ మాల్‌లు, జనసమ్మర్ద ప్రాంతాల్లో 15 రోజుల పాటు విద్యుత్ దీపాలు, ప్రత్యేకాలంకరణలు
* అన్ని విద్యాసంస్థల్లో ప్రతిరోజూ ప్రార్థన సమయంలో దేశభక్తి గీతాలను మైకుల ద్వారా వినిపించాలి.
* ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు వక్తృత్వ, వ్యాసరచన, చిత్రలేఖనం, దేశభక్తి గీతాల పోటీలు
* ఉపాధ్యాయులు, అధ్యాపకులకు దేశభక్తిపై కవితారచన పోటీలు