రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్, వైద్యారోగ్య, విద్య, అటవీశాఖలపై ముఖ్యమంత్రి కేసీఆర్... ఈనెల 11న సమీక్షించనున్నారు. మంత్రులు, కలెక్టర్లతో భేటీకానున్న సీఎం... ముఖ్యమైన అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో ఆయా శాఖలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈనెల 11న ఉదయం పదకొండున్నర గంటలకు ప్రగతిభవన్‌లో సమావేశం జరగనుంది. ఇటీవలే రెవెన్యూకు సంబంధించిన అంశాలపై సమీక్షించిన ముఖ్యమంత్రి... పరిష్కరించాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు.
వివిధ అంశాలపై...
పెండింగ్ మ్యుటేషన్లు, సాదాబైనామాల క్రమబద్ధీకరణపై సీఎం మార్గనిర్దేశం చేస్తారు. ట్రైబ్యునళ్ల ఏర్పాటు, పార్ట్-బీలో చేర్చిన అంశాల పరిష్కారంపై చర్చిస్తారు. రెవెన్యూ అంశాల పరిష్కారానికి అవసరమైన కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, నివారణకు తీసుకుంటున్న చర్యలపైనా ముఖ్యమంత్రి దృష్టిసారించనున్నారు.
టీకా పంపిణీపై...
కరోనా వ్యాక్సిన్‌ను ప్రజలకు అందించే కార్యాచరణపై చర్చించనున్న సీఎం కేసీఆర్... అన్ని ప్రాంతాలకు టీకా రవాణా, ప్రాధాన్యతా క్రమంలో పంపిణీ అంశాలపై వివరాలు అడిగి తెలుసుకుంటారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం అమలును సమీక్షిస్తారు. గ్రామాల్లో, పట్టణాల్లో పచ్చదనం పెంపునకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకుంటారు.
నిర్ణయం...
విద్యా సంస్థల్లో తరగతుల ప్రారంభంపై చర్చించనున్న ముఖ్యమంత్రి... ఏ తరగతి నుంచి తరగతులు నిర్వహించాలనే అంశంపైనా సమాలోచనలు చేస్తారు. ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానంపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.