సీఎం కేసీఆర్ ఆర్టీసీపై సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీ నష్టాల్లో కొనసాగుతోందని అధికారులు సీఎంకు తెలిపారు. ఇంధన ధరలు, లాక్‌డౌన్, బకాయిల వల్లే ఆర్టీసీలో నష్టాలొస్తున్నాయని వివరించారు. ఉద్యోగుల జీతాలు పెంచితే పెనుభారం తప్పదని కేసీఆర్కు చెప్పారు. ప్రభుత్వమే ఆర్టీసీకి సాయం అందించాలన్నారు. బస్సు ఛార్జీలు పెంచాలన్నారు. ఈ రెండు చర్యలు తీసుకుంటే తప్ప ఆర్టీసీ గట్టెక్కే పరిస్థితిలేదని చెప్పారు.
గతంలో బస్సు ఛార్జీలు పెంచినప్పుడు లీటర్ డీజిల్ ధర 67 రూపాయలు ఉండేదని, స్వల్ప వ్యవధిలోనే ధర లీటర్కు 15 రూపాయలు పెరిగిందని వివరించారు. డీజిల్ ధర పెంపు ఆర్టీసీపై తీవ్ర ప్రభావం చూపిందని, ఆర్థిక భారాన్ని మోపిందని చెప్పారు. కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ సమయంలోనూ సంస్థ నష్టాలను చవిచూసిందన్న అధికారులు... ఇప్పటికే పేరుకు పోయిన బకాయిల భారం ఉందని వివరించారు. ఏపీకి బస్సులు తిప్పడం వల్ల మంచి ఫలితం వచ్చిందన్నారు. ఆక్యుపెన్సీ 58 శాతానికి చేరిందని, ఆక్యుపెన్సీ క్రమంగా పెరుగుతోందని వివరించారు.