భర్తీకి అవకాశమున్న ఇతర ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేసేందుకు ఆసక్తి, అర్హత ఉన్న ఒప్పంద అధ్యాపకులకు అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. జూనియర్ కళాశాలల ఒప్పంద అధ్యాపకుల సమస్యలపై మంత్రులు సబిత, పువ్వాడ అజయ్, ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.
అధ్యాపకుల సమస్యలను మంత్రి సబిత, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్యమంత్రికి వివరించారు. ఒప్పంద అధ్యాపకుల విషయంలో ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు తీసుకున్నదన్న సీఎం... వారిని క్రమబద్ధీకరించాలన్న ప్రయత్నం న్యాయస్థానంలో కేసుల వల్ల నిలిచిపోయిందని చెప్పారు. వారి వేతనాలను రెట్టింపు చేశామని, గతంలో లాగా పదినెలలకు కాకుండా ఏడాది కాలానికి జీతాలు ఇస్తున్నామని తెలిపారు.