మొక్కజొన్న పంటకు ఈ సీజన్‌లో విరామమే మంచిదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. క్వింటాల్‌కు 900 రూపాయల ధర కూడా రాకపోవచ్చని సీఎం అనుమానం వ్యక్తం చేశారు. పంటల సాగు, వ్యవసాయ రంగాభివృద్ధికి సంబంధించి.. ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పంటలకు సంబంధించి అమలు చేయాల్సిన వ్యూహాలు, వ్యవసాయాధికారుల పాత్రపై సీఎం దిశానిర్దేశం చేశారు.
అనుకూల మార్కెట్ లేదు..
మొక్కజొన్నకు ప్రపంచవ్యాప్తంగా అనుకూల మార్కెట్ లేదన్న సీఎం.. దిగుమతి నిర్ణయాలు, ఇతరత్రా కారణాల వల్ల కేంద్రం క్వింటాల్‌కు రూ. 800, 900కు మించి ధర పలకడం కష్టమన్నారు. ఈ నేపథ్యంలో ఏ పంటలు పండించాలన్న విషయంపై రైతులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత.. వ్యవసాయ శాఖదే అని స్పష్టం చేశారు. మొక్కజొన్నకు గిట్టుబాటు ధర రాదని తేల్చిచెప్పాలని.. మొహమాటానికి పోయి సగం సమాచారం ఇస్తే రైతు నష్టపోయే ప్రమాదముందని హెచ్చరించారు. తక్కువ ధర వచ్చినా మొక్కజొన్న పండిస్తామంటే ఇక రైతుల ఇష్టమని కేసీఆర్ పేర్కొన్నారు.
రైతు సంక్షేమం కోసం నాలుగంచెల వ్యూహం..
రైతు సంక్షేమం కోసం నాలుగంచెల వ్యూహాలను అమలు చేయాలని సీఎం తెలిపారు. మంచి ధరలు వచ్చే పంటలు పండించేలా ప్రణాళికలు, నాణ్యమైన విత్తనాల సరఫరా, సకాలంలో ఎరువులు అందించడం, పంటకు మంచి ధరలు లభించేలా.. నాలుగు రకాల వ్యూహాలను పటిష్టంగా అమలు చేయాల్సి ఉంటుందని సీఎం వివరించారు. వేయాల్సిన, వేయకూడని పంటల విధానాలతో వచ్చే ఏడాది నుంచి అగ్రికల్చర్ కార్డును రూపొందించాలని తెలిపారు.
రైతులకు నిరంతర సూచనలు..
మార్కెట్లో ధర ఉన్న పంటలను ప్రభుత్వం నిర్ణయిస్తుందని.. ఈ మేరకు రైతులకు అవగాహన కల్పించే బాధ్యత వ్యవసాయ శాఖదేనని తెలిపారు. అప్రమత్తంగా ఉంటూ సరైన ప్రణాళికలు సిద్ధం చేసుకోకపోతే.. వ్యవసాయ శాఖకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. నియంత్రిత సాగును పకడ్బందీగా అమలుచేయాలన్న ముఖ్యమంత్రి.. దసరాకల్లా రాష్ట్రవ్యాప్తంగా సిద్ధమయ్యే రైతువేదికల్లో.. రైతులతో నిరంతరం కలుస్తూ సూచనలిస్తూ సమావేశాలు నిర్వహించాలన్నారు.
వ్యవసాయ శాఖలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీచేయాలని మంత్రి నిరంజన్‌రెడ్డితోపాటు ఉన్నతాధికారులకు సీఎం సూచించారు. పదోన్నతులు చేపట్టాలని, ఉద్యోగులైన భార్యాభర్తలు ఒకే చోట పనిచేసేలా బదిలీలు చేపట్టాలని తెలిపారు. ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్న కేసీఆర్.. రైతులకు సేవచేసేందుకు మానసికంగా సంసిద్ధులు కావాలని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి:'రాష్ట్రంలో మొక్కజొన్న సాగు ఏమాత్రం శ్రేయస్కరం కాదు'