CM KCR Review On Paddy: అకాల వర్షాలతో చేతికొచ్చిన వరి తడిసిపోతున్న తరుణంలో.. రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని తడిసిన ధాన్యాన్ని పూర్తిగా సేకరిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసా ఇచ్చారు. మామూలు ధాన్యానికి చెల్లించినధరనే తడిసిన ధాన్యానికి చెల్లిస్తామని హామీ ఇచ్చారు. యాసంగి వరి కొనుగోళ్లు జరుగుతున్న తీరు, అకాల వర్షాలకి తడిసినధాన్యం సేకరణ.. భవిష్యత్తులో యాసంగిసాగు, వ్యవసాయశాఖ అనుసరించాల్సిన కార్యాచరణ తదితర అంశాలపై.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
అకాల వర్షాలకు వరిధాన్యం తడుస్తున్నందున రైతన్నల ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకుంటుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఆపత్కాలంలో వారి కష్టాన్ని పంచుకొనేందుకు సిద్ధమని ఆయన తెలిపారు. తడిసిన వరి ధాన్యాన్ని సేకరించాలని నిర్ణయించినట్లు తెలిపిన ఆయన.. వీలైనంత త్వరగా ఒక్క గింజ మిగలకుండా సేకరిస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయంపై అన్నదాతలు ఆందోళన చెందవద్దని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మరో మూడు, నాలుగురోజులు వర్షాలు కురిసే అవకాశంఉందని చెప్పి.. అప్పటివరకు పంట కోయకుండా సంయమనం పాటిస్తే.. ధాన్యం తడవకుండా ఉంటుందని కర్షకులకు సలహా ఇచ్చారు.
శాస్త్రీయ అధ్యయనం చేయాలి: ప్రస్తుత వర్షాలను గుణపాఠంగా తీసుకొని భవిష్యత్‌లో నష్టం జరగకుండా ముందస్తు అవగాహన ఏర్పాటు చేసుకోవాలని వ్యవసాయశాఖ, రైతులకు కేసీఆర్ సూచించారు. ఏటా మార్చి వరకే కోతలు పూర్తయ్యేలా ముందుగానే వరి నాటుకోవాలన్నారు. మార్చి తర్వాత అకాల వర్షాలుపడే అవకాశం ఉన్నందున.. ఆలోపే కోతలు పూర్తిచేసుకోవడం మంచిదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఏప్రిల్, మే వరకు నూర్పకుంటే ఎండలు ఎక్కువై ధాన్యంలో నూక శాతం పెరిగిపోతుందని పేర్కొన్నారు. మార్చిలోపే వరి కోతలు పూర్తయ్యేలా మరింత శాస్త్రీయ అధ్యయనం చేసి రైతులను చైతన్య పర్చాలని వ్యవసాయశాఖను ఆదేశించారు. రసాయనిక ఎరువుల వాడకంపైనా అవగాహన కల్పించాలని చెప్పారు.